నల్లగొండ జిల్లా:విశ్వకర్మ కులానికి చెందిన తల్లోజు ఆచారిని అగ్ర కులహంకారంతో దూషించిన కేటీఆర్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని విశ్వకర్మ నేతలు డిమాండ్ చేశారు.కల్వకుర్తిలో నిర్వహించిన మీటింగ్ లో విశ్వకర్మ కుటుంబానికి చెందిన తల్లోజు ఆచారి కులాన్ని దూషించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా విశ్వకర్మ సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు.
ఈ సందర్బంగా విశ్వకర్మ నేతలు మాట్లాడుతూ కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ మీటింగ్ లో విశ్వకర్మ జాతికి చెందిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారిని ఉద్దేశించి,పప్పుగాడు, ఎవడో గొట్టం గాడు అని వ్యాఖ్యలు చేయడంపై విశ్వకర్మ సంఘానికి చెందిన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తెలంగాణ సృష్టికర్త అయిన ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశాడని,ఆయన తెలంగాణ కోసం ఎన్నో కలలు కన్నాడని,మలిదశ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి కాసోజు శ్రీకాంత చారి,తన శరీరాన్నే తెలంగాణ కోసం నిలువునా కాల్చేసుకున్నాడని,అలాంటి వారు ఈ తెలంగాణ రావడంలో అత్యంత కీలకపాత్ర పోషించిన తమ విశ్వకర్మ జాతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తే కేటీఆర్ దొర అహంకారం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందన్నారు.
తెలంగాణా ఏర్పడిన తరువాత అటు శ్రీకాంతాచారీ కుటుంబాన్ని కానీ,ఆయన జాతికి కానీ,ప్రభుత్వం ఏం చేయలేదని,కుల వృత్తులు చేస్తూ 45 సంవత్సరాలకే కంటి చూపు కోల్పోయి అనేక సమస్యలను అనుభవిస్తున్న తమ జాతికి ఇంతవరకు ఒక కార్పొరేషన్ కానీ,సబ్సిడీ రుణాలు కానీ,పింఛన్ లు కానీ,ఇవ్వకపోగా,చట్టసభల్లోకి రాకుండా కూడా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే కేటీఆర్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనియెడల రానున్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.