వైసీపీ నేతలకు నిజంగా ఇది పరీక్షా కాలమే.ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా… వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మాత్రం పార్టీ శ్రేణులంతా నిత్యం జనాల్లోనే తిరగాలని, జనాల్లో గ్రాఫ్ పెంచుకోవాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకు 175 గెలుచుకోవాలి అంటూ ఒత్తిడి పెంచుతున్నారు.
ఇక వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉంది.ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు, నివేదికలు ఇలా అన్నిటినీ తెప్పించుకుంటున్న జగన్ రాబోయే ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని, జనాల్లో గ్రాఫ్ పెంచుకొని నేతలను మొహమాటం లేకుండా పక్కనపెట్టేస్తాను అని, అవసరమైతే మీ స్థానంలో వేరొకరిని తీసుకుంటాను అంటూ ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం మరో ఎనిమిది నెలల పాటు కొనసాగుతుందని, ఆ తరువాత కూడా జనాల్లో ఉండేలా నాయకులు ప్లాన్ చేసుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ 2019 కంటే మెరుగైన ఫలితాలు రావాలని పదే పదే హిత బోధ చేస్తున్నారు.
దీనిపై వైసీపీ శ్రేణుల బాధ వేరేగా ఉంది.
జనాల్లో గ్రాఫ్ పెంచుకోవాలి అని జగన్ చెబుతుండటం బాగానే ఉంది కానీ… ఏపీలో పాలన విధానాలు, వంటివి కొన్ని ఇబ్బందికరంగా మారాయని, ఏపీలో చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించడం లేదని, సంక్షేమ పథకాలు వరకూ జనాల్లో సంతృప్తి ఉన్నా, రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండడం, గ్రామాల పట్టణాల్లో పెద్దగా అభివృద్ధి చోటు చేసుకోకపోవడం వంటివన్నీ వైసీపీ ఇమేజ్ ను జనాల్లో బాగా తగ్గిస్తున్నాయి అనే అభిప్రాయాలు సొంత పార్టీ నాయకులే వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో జనాల సమస్యలపై నిలదీస్తున్నా… వారికి అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నామని, ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో క్షేత్ర స్థాయిలో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి అని, వాటి ప్రభావం తీవ్రంగా తమపై పడుతోంది అంటూ వైసీపీ ఎమ్మెల్యే లు , నాయకులు వాపోతున్నారు.క్షేత్రస్థాయిలో పరిస్థితి ఈ విధంగా ఉంటే, జగన్ పెట్టిన పరీక్షలు తాము ఎలా పాస్ అవుతామని ప్రశ్నను ఇప్పుడు పార్టీ శ్రేణులు లేవనెత్తుతున్నాయి.







