విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడు.దీంతో తన దగ్గరకు చదువు నేర్చుకోవాలని వచ్చే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.
తన 30 ఏళ్ల సర్వీసులో 60 మందికి పైగా విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేశాడు.కేరళలోని మలప్పురం మున్సిపాలిటీలో సీపీఎం కౌన్సిలర్ కేవీ శశికుమార్ అదే పట్టణంలోని ఓ స్కూలులో టీచర్‌గా పనిచేసి ఈ ఏడాది మార్చి నెలలో రిటైర్ అయ్యాడు.
అయితే శశికుమార్ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్న సమయంలో అతడికి రాజకీయ అండ ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.అయితే అతడు రిటైర్డ్ అయినట్లు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని ఓ విద్యార్థిని ముందుగా తమను శశికుమార్ లైంగిక వేధింపులకు గురిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఇలా ఒకరి తర్వాత మరొకరు దాదాపు 50 మందికి పైగా పోలీసులకు ఫిర్యాదులు చేశారు.దీంతో పోలీసులు రంగంలోకి దిగారు
గతంలో మూడుసార్లు శశికుమార్ కౌన్సిలర్‌గా పనిచేయడంతో అతడికి రాజకీయ పలుకుబడి ఉండటంతో తాము ముందుకు రాలేదని బాధితులు పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే విద్యార్ధినులు వరుసగా ఫిర్యాదులు చేసిన క్రమంలో వారం రోజులుగా పరారీలో ఉన్న శశికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి ఈ కీచక ఉపాధ్యాయుడిపై విచారణకు ఆదేశించారు.తాజా పరిణామాలతో శశికుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది.
కాగా గతంలోనే శశికుమార్‌పై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని బీనా అనే యువతి ఆరోపించింది.
కొందరు యువతులను శశికుమార్ తీవ్రంగా దుర్భాషలు ఆడాడని.అంతేకాకుండా ఓ యువతి ఛాతిపై కొరకడంతో ఆమెను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని వివరించింది.2019లో పాఠశాల కార్పొరేట్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయింది.అప్పుడు ఎవరూ పోలీసులను ఆశ్రయించే సాహసం చేయలేదని పేర్కొంది.