సూర్యాపేట జిల్లా:నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజ్యాంగం మారుస్తామని మాట్లాడిన అహంకారపూరిత వ్యాఖ్యలకు నిరసనగా నూతనకల్ మండలం ఎల్కపల్లి గ్రామంలో భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మిర్యాల వెంకట్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిరసన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం అరవింద్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ కార్యక్రమానికి భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూరారపు పరీక్షన్ ముఖ్యాతిథిగా హజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ భారత రాజ్యాంగాన్ని మారుస్తామని,సెక్యులర్ అనే పదాన్ని తీసి వేస్తామని మాట్లాడిన మాటలను ఉపసంహరించుకొని,దేశ ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అరవింద్ చేసిన వ్యాఖ్యలు కులమతాలను పెంచి పోషించే విధంగా ఉన్నాయని,ప్రజల మధ్య తారతమ్యాలు సృష్టించే విధంగా మాట్లాడిన అతన్ని వెంటనే అరెస్టు చేయాలన్నారు.భారత రాజ్యాంగం వల్ల ఎంపీ అయిన వ్యక్తి భారత రాజ్యాంగాన్నే అవమానించిండు కాబట్టి అరవింద్ పై దేశద్రోహం కేసు పెట్టాలని,వెంటనే ఎంపీ పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ బిజెపి నుంచి అరవింద్ ను సస్పెండ్ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు పాల్వాయి విజయ్ కుమార్,భీమ్ ఆర్మీ నాయకులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.