భారతదేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే.ఇప్పుడు లీటర్ పెట్రోలు కొనాలంటే రూ.100కు పైగా చెల్లించాల్సి వస్తోంది.ధరలు ఇలా ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఒక్క రూపాయి తగ్గినా చాలు అని వాహనదారులు కోరుకుంటున్నారు.
ఇలాంటి తరుణంలో మహారాష్ట్రలోని థానేలో ఒక పెట్రోల్ బంక్‌లో కేవలం రూపాయికే లీటర్ పెట్రోల్‌ను వాహనదారులకు పంపిణీ చేశారు.ఒకరికి కాదు ఇద్దరికీ కాదు ఏకంగా వెయ్యి మందికి రూపాయి పెట్రోల్ పోసి అందరి దృష్టిని ఆకర్షించారు.
అయితే రూపాయికే పెట్రోల్ ఆఫర్ చేయడానికి ఒక కారణం ఉంది.అదేమిటంటే, ఏప్రిల్ 25వ తేదీన శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు వెయ్యి మందికి రూపాయికే పెట్రోల్ అందించారు.థానేలోని ఘోడ్‌బందర్ రోడ్డులోని కైలాష్ పెట్రోల్ పంప్ లో పెట్రోల్ చౌకగా వస్తుందని తెలిసి వేలాదిమంది క్యూ కట్టారు.అయితే కేవలం వెయ్యి మందికే రూ.1కే పెట్రోల్ అందించగా మిగతా వారు నిరాశగా వెనుదిరిగారు.పెరిగిన పెట్రోల్ ధరలపై నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు శివసేన పార్టీ కార్యకర్తలు తెలిపారు.“పెట్రోల్ కొట్టించే ప్రతిసారి సామాన్యుడిలో బాధ ఉంటుంది కానీ ఒక్క రోజైనా పెట్రోల్ కొట్టించే సమయంలో వారి ముఖంలో చిరునవ్వు చూడాలనుకున్నాం.అందుకే ఇలా తక్కువ ధరకే పెట్రోల్ ఆఫర్ చేశాం” అని ఒక పార్టీ కార్యకర్త తెలిపారు.

థానే మున్సిపల్ కార్పోరేషన్ మాజీ కార్పోరేటర్ ఆశా డోంగ్రే, సామాజిక కార్యకర్త సందీప్ డోంగ్రే, అబ్దుల్ సలాం కలిసి పెట్రోల్ ను పంపిణీ చేశారు.అయితే 1000 మంది వాహనదారులకు రూపాయికే పెట్రోల్ అందించడం వల్ల తమకు రూ.1 లక్ష 20 వేలు ఖర్చయిందని సామాజిక కార్యకర్త సందీప్ డోంగ్రే వెల్లడించారు.







