న్యూయార్క్ శివారులోని క్వీన్స్‌లో 75 ఏళ్ల సిక్కు వృద్ధుడిపై దాడి ఘటన భారత్ , అమెరికాలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.స్థానిక సిక్కు సమాజం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.తాజాగా న్యూయార్క్‌లోని భారత కాన్సూలేట్ కార్యాలయం కూడా ఈ ఘటనను ఖండించింది.
ఈ మేరకు సోమవారం ట్వీట్ చేసింది.ఈ దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్న న్యూయార్క్ పోలీస్ శాఖ, స్థానిక అధికారులతో టచ్‌లో వున్నామని.
బాధితుడి యోగ క్షేమాలను తెలుసుకోవడానికి తాము స్థానిక కమ్యూనిటీ సంస్థలతో మాట్లాడుతూనే వున్నామని కాన్సూలేట్ కార్యాలయం ట్విట్టర్‌లో తెలిపింది.
నిర్మల్ సింగ్ అనే 75 ఏళ్ల సిక్కు వృద్ధుడు ఆదివారం క్వీన్స్‌లోని రిచ్‌మండ్ హిల్‌లో వున్న స్థానిక గురుద్వారా సమీపంలో దాడికి గురైన సంగతి తెలిసిందే.
మార్నింగ్ వాక్‌కు వెళ్లిన బాధితుడిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు.ఈ ఘటనలో ఆయన ముక్కు పగిలిపోవడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి.సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో ఆయన తలపాగా, బట్టలు రక్తంతో తడిసిపోయి కనిపించాయి.ఈ ఘటన అమెరికాలోని సిక్కులతో పాటు భారతీయ కమ్యూనిటీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

సంచలనం సృష్టించిన ఈ దాడి ఘటనపై ఎన్‌వైపీడీ చీఫ్ ఆఫ్ డిటెక్టివ్ జేమ్స్ ఎస్సిగ్ దర్యాప్తు చేస్తున్నట్లు న్యూయార్క్ పోలీస్ కమీషనర్ కీచంట్ సెవెల్ తెలిపారు.నగరంలో ఈ తరహా దాడులను ఉపేక్షించేది లేదని, అలాంటి వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని సెవెల్ వెల్లడించారు.దాడికి సంబంధించిన సమాచారం వుంటే పోలీసులకు తెలియజేయాలని కమీషనర్ నగర ప్రజలను కోరారు.
బాధితుడు నిర్మల్ సింగ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్లు ఓ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది.
The Sikh Coalition సంస్థ. ఈ కేసులో నిర్మల్ సింగ్‌కు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామని తెలిపింది.
దీనికి సంబంధించి ఎన్‌వైపీడీ హేట్ క్రైమ్స్ టాస్క్‌ఫోర్స్‌తో టచ్‌లో వున్నట్లు The Sikh Coalition పేర్కొంది.వృద్ధుడిపై దాడిని ‘‘ద్వేషపూరిత నేరం’’గా భావించి పరిశోధిస్తున్నట్లు ఈ టాస్క్‌ఫోర్స్ ధృవీకరించింది.







