ఏది ఏమైతేనేం జనసేన పార్టీలో జోష్ బాగా పెరిగింది .ఏదో ఒక పార్టీ అండతో 2024 ఎన్నికల్లో తాము తప్పకుండా గెలుస్తాము అనే ధీమా ఆ పార్టీ నాయకులలోను కనిపిస్తోంది.
దీనికి తగ్గట్టుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు.కమిటీల నియామకం చేపడుతూ , పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో ఉన్నారు.
ఇక సినిమాలలోనూ పవన్ బిజీ గా ఉంటూ వస్తుండడంతో, జనసేన రాజకీయ వ్యవహారాలన్నీ ఆ పార్టీ కీలక నాయకుడు పవన్ కు అత్యంత సన్నిహితుడైన నాదెండ్ల మనోహర్ చక్కబెట్టే పనిలో ఉన్నారు.ఎప్పటి నుంచో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
అన్ని రాజకీయ వ్యవహారాలను ఆయన చక్క పెడుతున్నారు.
జనసేన సరైన మార్గంలో వెళ్లే విధంగా రూట్ మ్యాప్ ను ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నారు.
ఎన్నికల్లో జనసేన ఖచ్చితంగా గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు అన్నిటిని మనోహర్ చూస్తున్నారు.తాజాగా జనసేన లోని మహిళా ప్రాంతీయ కమిటీల తో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.మహిళా విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన వివరించారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా వీర మహిళా విభాగం కృషి చేయాలని, మహిళా ఓటు బ్యాంకును పెంచుకునే విధంగా వ్యవహారాలు చేయాలని సూచించారు.
ప్రతి జిల్లాలోనూ పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహించాలని కోరారు.జిల్లాలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసుకుని మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధికి జనసేన తోడ్పాటును అందించే విధంగా ప్రణాళికలు రచిస్తోందన్నారు.
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు మహిళా శక్తిని పార్టీ కోసం ఉపయోగించుకుంటామని, దీనికోసం తగిన కార్యక్రమాలను రూపొందించి అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

పార్టీ కోసం కృషి చేసే వీర మహిళ లకు కమిటీ బాధ్యతలు అప్పగిస్తాం అన్నారు.పార్టీలో క్రియాశీలక కార్యకర్తల నమోదు మంచి ఉత్సాహాన్నిచ్చింది అని, ప్రస్తుతం వీర మహిళా విభాగం కూడా పూర్తిస్థాయిలో బలోపేతం చేసే విషయం పైన దృష్టి పెట్టమని నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు.జనసేన కార్యకలాపాల్లో పవన్ కళ్యాణ్ నేరుగా పాల్గొనే అంత తీరిక లేకపోయినా నాదెండ్ల మనోహర్ మాత్రం పవన్ ఆశయాలకు అనుగుణంగా జనసేన ను ముందుకు తీసుకు వెళ్తున్నట్టు గా కనిపిస్తున్నారు.