తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు ప్రజావ్యతిరేకత తీవ్రంగా పెరిగిందనే నివేదికలు, సంకేతాలు ఎన్నో వస్తున్నాయి.దీనికి తోడు దుబ్బాక , హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి చెందడంతో, బిజెపి గ్రాఫ్ క్రమంగా పెరిగింది అనే సంకేతాలు తెలంగాణలో పెరిగాయి.
అదే ఉత్సాహంతో ఉన్న బిజెపి తెలంగాణ లో ఏదో రకంగా అధికారంలోకి రావాలని చూస్తోంది. ఇప్పుడున్న పరిణామాలను సమర్ధవంతంగా ఉపయోగించుకుని బీజేపీని మరింత బలోపేతం చేయాలి అనే విషయంపైనే దృష్టి సారించింది.
ఈ మేరకు పార్టీ రాష్ట్ర నేతలకు ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలు నుంచి సూచనలు, సలహాలు అందుతూనే ఉన్నాయి.ముఖ్యంగా బీజేపీ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూడాలని కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి నేతలను బలమైన నియోజకవర్గ స్థాయి నాయకులను బిజెపిలో చేరే విధంగా ఒత్తిడి పెంచాలని సూచనలు అధిష్టానం నుంచి అందుతున్నాయి .
దీనికి తగ్గట్లుగానే ఎవరెవరు పార్టీలో చేరే అవకాశం ఉంది టిఆర్ఎస్ కాంగ్రెస్ లో ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారనే విషయం పైన బీజేపీ దృష్టి సారించింది.ఇంత వరకు బాగానే ఉన్నా బిజెపి కి తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న, మిగతా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.
టిఆర్ఎస్ ఢీకొట్టి గెలిచే అంత సత్తా ఉన్న నాయకులు తక్కువగానే ఉన్నారు.మొదటినుంచి బిజెపి లో ఉన్న నాయకుల్లో బలమైన వారు లేకపోవడం, టిఆర్ఎస్ , కాంగ్రెస్ లను ధీటుగా ఎదుర్కొని విజయం సాధించగల నాయకులు పెద్దగా లేకపోవడంతో టిఆర్ఎస్ లోని బలమైన నాయకులు పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది.
వారిని ఏదో రకంగా ఒప్పించి పార్టీలో చేర్చుకోవడం మినహా మరో ప్రత్యామ్నాయం బిజెపికి కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది .

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ పరిస్థితి మెరుగైనట్టుగా కనిపించినా, దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం, ఆ పార్టీని మరింత కంగారు పడతోంది.మొన్నటివరకు టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపించినా, బీజేపీ ఆకస్మాత్తుగా బలపడటంతో కాంగ్రెస్ ఆశలు గల్లంతైనట్లు కనిపిస్తున్నాయి.టిఆర్ఎస్ పై పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడం లో బీజేపీ, కాంగ్రెస్ లు ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి.