ఏపీలో ఉప ఎన్నికల తంతు మొదలైపోయింది.కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లో జరగబోతున్న ఉప ఎన్నికలు టీడీపి, వైసీపీ మధ్య రసవత్తరంగా ఉంటాయని ముందుగా అందరూ అంచనా వేసినా, జనసేన తెలుగుదేశం పార్టీలు తాము ఇక్కడ నుంచి పోటీ చేయము అంటూ ప్రకటించాయి.
అసలు ముందుగానే టిడిపి ఇక్కడ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ ను ప్రకటించినా, ఇక్కడ ఎన్నికల ప్రచారం ఆయన నిర్వహించినా, చివరకు పోటీ నుంచి టీడీపీ తప్పుకోవడంతో బిజెపి కాంగ్రెస్ వైసీపీలు మాత్రమే ప్రధానంగా పోటీ పడుతున్నాయి.బీజేపీకి ఇక్కడ పెద్దగా బలం లేకపోయినా, పోటీకి దిగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే ఈ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ తో ముందుకు వస్తోంది.
ఇక్కడ వైసిపికే విజయం దక్కుతుందనే విషయం కాంగ్రెస్ , బిజెపి నాయకులకు తెలిసినా, బిజెపి కంటే ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకుని ఏపీలో ఆ పార్టీ కంటే తామే బెటర్ అన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు కాంగ్రెస్ ఇప్పుడు తంటాలు పడుతోంది.
బద్వేలు నియోజకవర్గంలో బిజెపి ని టార్గెట్ చేసుకున్న కాంగ్రెస్ ఆ పార్టీపై వ్యతిరేకత పెంచేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను బద్వేల్ ఎన్నికల ప్రచారంలోకి దించాలని ప్లాన్ చేస్తోంది.స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రచారానికి వస్తే టిడిపికి పడాల్సిన ఓట్లు తమకు పడతాయని కాంగ్రెస్ ఆశ పడుతోంది.
అంతేకాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కమలమ్మ గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పని చేయడం , స్థానికంగా బలమైన కేడర్ ఆమెకు ఉండడం , ఇవన్నీ బిజెపి కంటే తమకు ఎక్కువ ఓట్లు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

దీనికి తోడు కమలమ్మ బద్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా పనిచేసిన సమయంలో చేసిన అభివృద్ధి, ఇవన్నీ ఎంతో కొంత బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ సానుకూలత ఉంటుంది అనే ధీమాలో ఆ పార్టీ ఉంది.ఇక టిడిపి శ్రేణులు సైతం బీజేపీకి మద్దతు ఇచ్చే కంటే కాంగ్రెస్ కు మద్దతు పలకడమే బెటర్ అనే అభిప్రాయం లో ఉండడం ఇవన్నీ తమకు కలిసి వస్తాయని, ఇక్కడ గెలిచే ఛాన్స్ లేకపోయినా, బిజెపి కంటే కాంగ్రెస్ ఫర్వాలేదు అన్న అభిప్రాయాన్ని జనాల్లో కల్పించాలని చూస్తోంది.అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ పై జనాల్లో ఆగ్రహం పెరిగిందని, అది తప్పకుండా బద్వేల్ ఉప ఎన్నికల్లో కనిపిస్తుంది అనే అంచనాలో కాంగ్రెస్ ఉంది.