తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైయస్ షర్మిల బలమైన పార్టీగా వైఎస్సార్ టీపీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి లకు ధీటుగా తమ పార్టీని బలోపేతం చేసేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు .
ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వంపై అదేపనిగా విమర్శలు చేస్తున్నారు.అయినా, షర్మిల పార్టీకి అంత స్థాయిలో ఆదరణ అయితే కనిపించడం లేదు.
మొదట్లో పెద్దఎత్తున మీడియా మద్దతు లభించినా, ఇప్పుడు ఆమె పార్టీని సైతం పట్టించుకోకపోవడం, పార్టీలో చేరికలు పెద్దగా లేకపోవడం, మొదట్లో చేరిన వారు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్న తీరు ఇలాంటివన్నీ షర్మిలకు మరింత కంగారు పుట్టిస్తున్నాయి.ముందు ముందు పార్టీలో చేరే వారి కంటే, బయటికి వెళ్లే వారు ఎక్కువగా ఉన్నారనే సమాచారం షర్మిలకు మరింత ఇబ్బందికరంగా మారింది.
ఈ క్రమంలోనే ఆమె నిరుద్యోగ దీక్ష ఒక్కటే నమ్ముకొని ముందుకు వెళ్తే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవ్వకపోతే, రాబోయే ఎన్నికల నాటికి పరిస్థితి దారుణంగా ఉంటుందనే విషయాన్ని షర్మిల గ్రహించారు.ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి సరికొత్త రూట్లో పార్టీని నడిపించాలని నిర్ణయానికి వచ్చారు.
ఈ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండా ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు.ఈ నియోజకవర్గంలో మొత్తం 86 జండా దిమ్మలతో పాటు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే పనికి ఆమె శ్రీకారం చుట్టారు.
ఖమ్మం జిల్లాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మా ఇప్పటికీ పనిచేస్తుందని, గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఖమ్మం జిల్లాలో వచ్చిన సీట్లు ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న షర్మిల ముందుగా ఖమ్మం జిల్లా పై పట్టు సాధించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఈ జిల్లాలో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తే, ఆ తర్వాత మిగతా జిల్లాల పై దృష్టి పెట్టవచ్చని షర్మిల డిసైడ్ అయ్యారట.అలాగే ఖమ్మం జిల్లా నుంచి పాదయాత్ర కూడా చేపట్టి తమ పార్టీ మైలేజ్ పెరిగే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.దీని ద్వారా పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఆమె బలంగా నమ్ముతున్నారు.
ప్రతి మంగళవారం చేపడుతున్న నిరుద్యోగ దీక్ష యధావిధిగా చేపడుతూ, ఖమ్మం జిల్లా పై పూర్తి స్థాయిలో పట్టు సంపాదించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట.ఈ సరికొత్త ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.