తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి అంతకు ముందుగానే అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారు.ఒకవైపు సీనియర్ నేతలను కలుస్తూ, అసంతృప్తి లేకుండా చూసుకుంటూనే మరోవైపు రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పర్యటించాలని, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దీనికోసం పార్టీలోని తన రాజకీయ శత్రువులను దగ్గర చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
వీటితో పాటు గాంధీ భవన్ లోనూ అకస్మాత్తుగా మార్పుచేర్పులు చేపట్టారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను అధికారానికి దూరం అవడానికి వాస్తు లోపం అని నమ్ముతున్న రేవంత్ ఈ మేరకు మార్పు చేర్పులు చేయించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు వాస్తు నిపుణులు , వేదపండితులు గాంధీభవన్ ను పూర్తిగా పరిశీలించి అనేక మార్పులు చేర్పులు సూచించినట్లు తెలుస్తోంది.ఆ ప్రకారమే గాంధీభవన్ లో ఎంట్రీ పాయింట్ ను మార్చాలని నిర్ణయానికి వచ్చారు.
అలాగే ఎంట్రన్స్ ను గాంధీభవన్ క్యాంటీన్ నుంచి పాత గేట్ నుంచి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.అలాగే గాంధీభవన్ పార్టీ జెండాలు అమ్మే రూమ్, సెక్యూరిటీ రూమ్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు గాంధీభవన్ తూర్పు ఈశాన్యం వైపు ఎటువంటి నిర్మాణాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.అలాగే గాంధీభవన్ ఆవరణలో ఎటువంటి కట్టడాలు లేకుండా కేవలం గాంధీ విగ్రహం మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే సమయం నాటికి ఈ మార్పు జరిగేలా ప్లాన్ చేసుకున్నారు.ఈ మార్పుచేర్పులు వరకు బాగానే ఉన్నా, ఈ వ్యవహారం లో రేవంత్ రెడ్డి పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ కు వాస్తు పిచ్చి బాగా ఉందని అందుకే ఆయన గత ఏడేళ్లుగా సచివాలయానికి రావడంలేదని, ఆయన వర్కింగ్ సీఎం అంటూ రేవంత్ అనేకసార్లు విమర్శలు చేశారు.అంతేకాదు వాస్తు పిచ్చి కారణంగా వందల కోట్లు ఖర్చు పెట్టి మరి కొత్త సచివాలయం కడుతున్నారని అనేకసార్లు ఎగతాళి చేశారు.
అంతగా ఎగతాళి చేసిన రేవంత్ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే సమయంలో వాస్తు ప్రకారం మార్పుచేర్పులు చేయించడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.