అమెరికాలో కరోనా వేవ్ కొనసాగుతూనే వుంది.రోజుకు వేల సంఖ్యలో కేసులు బయపడుతున్నాయి.
ఇప్పటికే అక్కడ మరణాల సంఖ్య 5 లక్షలను దాటేసింది.పలు సర్వేలు, నమూనాల ఆధారంగా చూస్తే అగ్రరాజ్యంలో వాస్తవ కేసులు, మరణాల సంఖ్య ప్రభుత్వ లెక్కల కంటే 2 నుంచి 7 రెట్లు అధికంగా వుండే అవకాశం వుందని పలు సంస్థల అంచనా.
తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిసార్టులో కరోనా కలకలం సృష్టించింది.ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో రిసార్ట్ ట్రంప్ యాజమాన్యంలో నడుస్తోంది.అందులో విధులు నిర్వర్తిస్తున్న పలువురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో అధికారులు రిసార్టును తాత్కాలికంగా మూసివేశారు.అయితే ఎంత మందికి కరోనాగా తేలిందనే విషయాన్ని క్లబ్ మేనేజ్మెంట్ స్పష్టంగా వెల్లడించడం లేదు.
ట్రంప్ జనవరిలో అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి ఈ రిసార్టును ఆయన అధికార నివాసంగా ఉపయోగిస్తున్నారు.కరోనా లక్షణాలున్న పలువురు సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.
ఈ ఘటనపై ఫ్లోరిడా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ను మీడియా ప్రశ్నించినప్పటికీ వారి నుంచి స్పందన లేదు.వచ్చే నెలలో జరగనున్న ఫ్లోరిడా రిపబ్లికన్ నేషనల్ కమిటీ స్ప్రింగ్ రిట్రీట్‌కు ట్రంప్ క్లబ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
కాగా, ఫ్లోరిడా రాష్ట్రంలో గడిచిన కొన్ని వారాలుగా కోవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి.దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడానికి ముందే ఇక్కడి ప్రభుత్వం ఫ్లోరిడాలో వ్యాపార లావాదేవీలకు అనుమతించింది.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.ఫ్లోరిడాలో రోజుకు సగటున 5,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి.
పామ్ బీచ్ కౌంటీ హెల్త్ డైరెక్టర్ అలీనా అలోన్సో మాట్లాడుతూ.గత వారం నుంచి స్థానికంగా కేసులు తగ్గుతున్నాయని తెలిపారు.
ప్రజలు కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తున్నారని.త్వరలోనే ఈ మహమ్మారిపై విజయం సాధిస్తామని అలీనా ఆకాంక్షించారు.
కాగా, అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా డొనాల్డ్ ట్రంప్‌పై కొందరు అమెరికన్లకు ఇంకా కోపం తగ్గలేదు.టెక్సాస్‌లోని ఓ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ట్రంప్ మైనపు విగ్రహంపై ప్రజలు పిడిగుద్దులతో విరుచుకుపడుతున్నారు.లాయిస్ టుస్సాడ్స్ వాక్స్వర్క్స్లోని ట్రంప్ విగ్రహం మొహం భాగంపై పంచ్‌ల వర్షం కురిపిస్తున్నారు.దీంతో ట్రంప్ మైనపు బొమ్మ మొహంపై గాట్లు పడ్డాయి.చేసేదేమీ లేక ప్రజల బారి నుంచి ట్రంప్ విగ్రహాన్ని కాపాడేందుకు వేరే ప్రాంతానికి తరలించారు నిర్వాహకులు.