రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయన ఏంటో ఆయన రాసిన నవలలే చెబుతాయి.
రెండు దశాబ్దాల క్రితం ఆయన రాసిన చాలా నవలలు సినిమాలుగా వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.నవలారచయితగానే కాకుండా వ్యక్తిత్వ వికాసంపై కూడా యండమూరి రాసిన పుస్తకాలు భాగా పాపులర్ అయ్యాయి.
చాలా కాలంగా రచనకి దూరంగా ఉన్న యండమూరి నవలల ద్వారా ఇప్పటికి ఆయన గురించి అందరూ చర్చించుకుంటున్నారు.ఇంత వరకు తెలుగు సినిమాకే పరిమితం అయిన యండమూరి నవలలు ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్ళాయి.
ఆయన రాసిన ఆనందోబ్రహ్మ నవల కథతో హాలీవుడ్ లో సినిమా తీయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి.
ఇందుకు సంబంధించిన కాపీ రైట్స్‌ను అమెరికాలో స్థిరపడ్డ తెలుగు దర్శక, నిర్మాత మేక ముక్తేశ్ రావు కొనుగోలు చేశారు.ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మూడు హాలీవుడ్ చిత్రాలు నిర్మిస్తోన్న ఆయన ఆనందో బ్రహ్మ నవలను సినిమాగా తీయాలని అనుకుంటున్నారు.1729 పిక్చర్స్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ మీద ఈ సినిమాను ఆయన నిర్మించనున్నారు.హాలీవుడ్ నేటివిటీ, కల్చర్ కి సరిపోయే విధంగా ఈ నవల కథ ఉండటంతో, అక్కడి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందని ఆయన భావిస్తున్నారు.మనుషుల మధ్య సంబంధాలను, ఆత్మీయానుబంధాలను ఈ నవలలో యండమూరి అద్భుతంగా ఆవిష్కరించారు.
తన నవల ఆధారంతో హాలీవుడ్ లో సినిమా తెరకెక్కించడంపై యండమూరి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు ముక్తేశ్ రావుకు అభినందనలు తెలిపారు.మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.