భారతదేశంలోని అన్ని భాషల్లో అనేక పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ రోజు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.బాలు మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
బాలు మృతితో సంగీత ప్రపంచం మూగబోయిందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.బాల సుబ్రహ్మణ్యం కేవలం మాతృ బాషకే పరిమితం కాకుండా దేశంలో ఉన్న అన్ని భాషల్లో పాటలు పాడిన మహానుభావుడని, దక్షిణాదిలో ఆయనకు అభిమానులు కాని వారుండరని, ఆయన తీయని స్వరాన్ని ఎప్పటికి మర్చిపోలేమని పలువురు సినీ ప్రముఖులు తెలిపారు.
1966 డిసెంబర్ 15వ తేదీన ప్లేబ్యాక్ సింగర్ గా తన సినీ ప్రస్థానాన్ని బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు.17 భాషల్లో 41,230 పాటలు పాడిన ఘనత ఆయనకే సొంతం.వివిధ విభాగాల్లో ఇప్పటివరకూ 25 నంది పురస్కారాలను అందుకున్నారు.కరోనా బారిన పడి కోలుకుంటున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాసను విడిచారు.ఈ మేరకు సుబ్రహ్మణ్యం మరణించినట్లు తన కొడుకు చరణ్ ప్రకటించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంతో ఆయన కుటుంబంతోపాటు సినీ ప్రపంచం మూగబోయింది.
ఈ మేరకు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి.చెన్నై సమీపంలోని మహలింగపురం కామదార్ నగర్ రెడ్ హిల్స్ లోని ఆయన నివాసంలో రేపు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.