మన నిత్య జీవితంలో సోషల్ మీడియా యాప్ లకు పెరుగుతున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.ఇతర యాప్ లతో పోలిస్తే మనం ఫేస్ బుక్, వాట్సాప్ యాప్ లను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం.
అయితే కత్తికి రెండు వైపులా ఏ విధంగా పదును ఉంటుందో సోషల్ మీడియా ద్వారా కూడా మంచి, చెడు రెండూ జరుగుతాయి.సరైన విధంగా ఉపయోగించుకుంటే సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే నష్టాలు కూడా అదే విధంగా ఉన్నాయి.
ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలను ఆకతాయిలు వాట్సాప్ ద్వారా వేధిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.అయితే మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాట్సాప్ వేధింపులకు సులభంగా చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది.
టెక్ నిపుణులు వాట్సాప్ వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.కొన్ని సూచనలు పాటించడం ద్వారా ఆకతాయిల వేధింపులకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.
గుర్తు తెలియని నంబర్ల నుంచి వాట్సాప్ వీడియో కాల్ వస్తే వీలైనంత వరకు లిఫ్ట్ చేయకపోవడమే మంచిది.ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయాల్సి వస్తే సెల్ఫీ కెమెరాను మూసివేయాలి.
ఇలా చేయడం వల్ల మనకు అవతలి వ్యక్తులు కనిపించినా మనం అవతలి వ్యక్తులకు కనిపించము.మన సన్నిహితుల, బంధువుల నంబర్లను ఫోన్ లో సేవ్ చేసుకోవాలి.
ఆ నంబర్ల నుంచి కాకుండా ఆకతాయిలు కొత్త నంబర్ల ద్వారా కాల్ చేస్తే అలాంటి నంబర్లను బ్లాక్ చేయడం మంచిది.
మన దేశం కోడ్ అయిన +91 కాకుండా ఇతర దేశాల కోడ్ లతో ఫోన్ వస్తే లిఫ్ట్ చేయకపోవడమే ఉత్తమం.
వాట్సాప్ మన ప్రొఫైల్ పిక్ ను మన కాంటాక్ట్స్ లో ఉన్నవాళ్లు మాత్రమే చూసే విధంగా జాగ్రత్త వహిస్తే మంచిది.కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మన నంబర్ కొత్త వాట్సాప్ గ్రూప్లలో యాడ్ అవుతూ ఉంటాయి.
అలా జరగకుండా ప్రైవసీ సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవాలి.ఎవరైనా అసభ్యకర సందేశాలు పంపినా, బెదిరింపులకు పాల్పడినా సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఉత్తమం.