డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎంతో మంది మైనర్ బాలికల జీవితాలను నాశనం చేసిన సోనూ పుంజాబన్ అలియాస్ గీతాఅరోరా పాపం పండింది.ఆమె చేసిన కిరాతకాలకు 24 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి జస్టిస్ ప్రీతమ్ సింగ్ సంచలన తీర్పు వెల్లడించారు.
అలాగే, సోనూ సహనిందితుడైన సందీప్ బేడ్వాల్‌కు బాలికల కిడ్నాప్, విక్రయం, అత్యాచారం కేసులో 20 ఏళ్ల కారాగార శిక్ష విధించారు.అంతేకాకుండా రూ.65 వేల జరిమానా కూడా విధించారు.
గీత అరోరా మూడేళ్ల కిందట కూడా అరెస్టు అయి నిర్ధోషిగా బయటపడింది.
ఈ క్రమంలో ఆమెను ఈ సారి పక్కా ఆధారాలతో పట్టుకోవాలని పోలీసులు పథకం రచించారు.ఇందుకోసం వారు మూడేళ్లుగా శ్రమించారు.చివరికి వారి ప్రయత్నం ఫలించింది.గీత అరోరా న్యాయస్థానానికి చిక్కింది.
పంజాబ్‌కు చెందిన బాలిక(12) గీత అరోరా తన సహాయకుడు సందీప్ బేడ్వాల్‌తో కలిసి అక్రమంగా తరలించి వ్యభిచారంలోకి దించింది.ఆమెను అనేక ప్రాంతాలకు తరలించి విటుల వద్దకు పంపిస్తూ నరకం చూపించింది.
ఇలా ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది నిందితురాలు గీత అరోరా.ఈ మేరకు నిందితురాలిపై పోలీసులు ఐపీసీ సెక్సన్ 366, 372,373, 328,342 120 బి ల కింద కేసు నమోదు చేశారు.
విచారణ సందర్భంగా గీత అరోరా అరాచకాలను విని న్యాయమూర్తి సైతం విస్తుపోయారు.విటుల వద్దకు వెళ్లడానికి నిరాకరించిన బాలికలకు మత్తుమందు ఇచ్చి మరీ వారి జీవితాలను నాశనం చేసేదని పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.
సాటి మహిళల జీవితాలను నాశనం చేసిన ఆమెకు సమాజంలో తిరిగే అర్హత లేదని జడ్జి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.