నార్త్ వెస్ట్రన్ అలస్కా ప్రాంతంలోని గ్రిజ్లీ ఎలుగుబంటిని వేటాడేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్‌కు అనుమతి లభించింది.వాయువ్య అలస్కాలోని సెవార్డ్ ద్వీపకల్పంలో సంచరించే గ్రిజ్లైను వేటాడేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకున్న ముగ్గురిలో ట్రంప్ జూనియర్ ఒకరని వన్య ప్రాణుల సంరక్షణ శాల డైరెక్టర్ ఎడ్డీ గ్రాసర్ తెలిపారు.
ఎలుగుబంట్లు, కారిబౌ, మూస్ మరియు ఇతర జంతువులను వేటాడేందుకు అనుమతి కోసం ప్రభుత్వం డ్రా తీస్తుంది.ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతి ఏటా వేలాది దరఖాస్తులు వస్తాయి.ఇంతటి పోటీలో విజేతగా నిలవడం అదృష్టమే.అయితే ట్రంప్ కుమారుడికి అవకాశం దక్కిన తాజాగా డ్రాలో తక్కువ పోటీ ఉంది.
తాజా వేటకు సంబంధించిన విజేతలను శుక్రవారం ప్రకటించారు.నోమ్ ఏరియాలో ఎలుగుబంటిని వేటాడేందుకు గాను నాన్ రెసిడెంట్ ట్యాగ్ ఫీజు కింద 1000 డాలర్లు, నాన్ రెసిడెంట్ లైసెన్సింగ్ ఫీజు కింద 160 డాలర్లు చెల్లించాలని గ్రాసర్ తెలిపారు.

ట్రంప్ జూనియర్‌కు వేట పట్ల మంచి అభిరుచి ఉంది.అతనికి అలాస్కా, కెనడాలోని పలు ప్రాంతాల్లో వేటాడిన అనుభవం ఉంది.ఈ ఏడాది అలాస్కాలో జింకలు, బాతులు వేటాడాలని ఆయన నిర్ణయించుకున్నారు.ఈ నెలలో సఫారి క్లబ్ డోనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో 1,50,000 డాలర్లతో ఏడు రోజుల వేట ఒప్పందం కుదుర్చుకుంది.
మరోవైపు రాఫిల్ విజేతకు వచ్చే నవంబర్‌లో జూనియర్ ట్రంప్‌తో కలిసి టోంగస్ నేషనల్ ఫారెస్ట్ సమీపంలోని తీర ప్రాంతాల్లో ప్రయాణించే అవకాశం లభిస్తుంది.