మహారాష్ట్ర లో శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.దీనితో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే మహారాష్ట్ర సీఎం గా పగ్గాలు చేపట్టారు.
అయితే మహారాష్ట్ర లో శివసేన తనదైన మార్క్ పాలనను కొనసాగిస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా మాతృ భాష విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని ప్రతి పాఠశాల లోనూ పదో తరగతి వరకు తప్పనిసరిగా మహారాష్ట్ర ప్రజల మాతృ భాష అయిన మరాఠీ బోధన తప్పనిసరిగా ఉండాలి అంటూ నిర్ణయం తీసుకుంది.దీనికి సంబందించిన బిల్లును కూడా త్వరలో తీసుకురావాలి అంటూ సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం జరిగిన ఈ సమావేశానికి ఉద్ధవ్ థాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు.స్కూళ్లలో మరాఠీని తప్పనిసరి చేస్తూ బిల్లు తీసుకురావాలని అజిత్ పవార్ ప్రతిపాదించడం తో మహారాష్ట్ర సర్కార్ ఈ మేరకు బిల్లు తీసుకురావాలి అంటూ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కాలంలో ఉద్ధవ్ థాక్రే బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే మరాఠా ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారు.పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసవచ్చిన వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకి అనుకూలంగా మహా ర్యాలీ నిర్వహించారు.ఈ క్రమంలో ఆయన్ను ఢీకొట్టడానికి మరాఠా భాషను తప్పనిసరి చేసే బిల్లును తెరపైకి తెచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు నాలుగో తరగతి వరకు మరాఠీను తప్పనిసరిగా బోధిస్తుండగా ఇప్పుడు ఈ తాజా బిల్లు గనుక ఆమోదం పొందితే ఇక పదో తరగతి వరకు కూడా ఈ మరాఠీ బోధన తప్పనిసరి కానుంది అన్నమాట.