రాజకీయ నాయకుల నోటికి హద్దు పద్దు ఉండదు.ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ… ప్రజలను మభ్యపెడుతూనే ఉంటారు.
ఇక ఎన్నికల సీజన్ లో అయితే చెప్పే పనేముంది.ఓటర్లను హామీల వర్షంలో ముంచెత్తేస్తూ… ఆకాశాన్ని కూడా నేలమీదకు తెచ్చేస్తాం అన్నట్టుగా హామీల జల్లులు కురిపించేస్తున్నారు.
ఇప్పుడు తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న పని ఒక్కటే… తమ ప్రత్యర్థి పార్టీ ఇస్తున్న హామీలకు డబుల్ హామీలు ఇస్తూ….జనాలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.
పార్టీల హామీలతో జనాలు ఆహా .ఓహో అంటూ ఊహాగానాల్లో తేలిపోతున్నారు.కానీ అసలు వీరు ఇస్తున్న హామీలు అమలు సాధ్యమేనా అనే విషయాన్ని మాత్రం పెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు.అసలే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆదాయం అంతంత … అప్పులు కొండంత అన్నట్టుగా పరిస్థితి ఉంది.

తెలంగాణాలో ప్రస్తుతం గెలుపే లక్ష్యంగా పోరాడుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు, తమిళనాడు తరహాలో వరాల జల్లులు కురిపిస్తున్నాయి.కనీసం రాష్ట్ర ఆదాయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ఇప్పటికి గట్టెక్కితే చాలన్నట్టుగా మేనిఫెస్టోలతో జనాలకు టోకరా వేస్తున్నాయి.కానీ ఈ లెక్కలన్నిటిని సరిచేయాల్సిన అధికారులు మాత్రం ఈ హామీలు చూసి లబోదిబో అంటూ గగ్గోలుపెడుతున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.2018-19 ఆర్ధిక సంవత్సరంలో 1,74,453 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు.రెవెన్యూ వ్యయం లక్షా 25వేల 454కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం 33వేల 369 కోట్లు.
ఇక రాష్ట్ర ఆదాయం 73వేల 751కోట్లుగా టార్గెట్ పెట్టుకున్నారు.మరోవైపు కేంద్రం నుంచి వచ్చే ఆదాయం 29వేల 41కోట్లని అంచనా వేశారు.రాష్ట్ర జీడిపి పెరుగుతుందని, ఈ ఏడాది వృద్ది రేటు 10.4 ఉంటుందని అంచనా కట్టారు.
కానీ ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తి అవ్వకముందే ఎన్నికలు రావడంతో ప్రస్తుతం ప్రభుత్వ పథకాలతో పాటు, కొత్త పథకాలు ప్రారంభిస్తామని అన్ని పార్టీలు హామీ ఇస్తున్నాయి.వ్యవసాయం, విద్యుత్, విద్యా,వైద్యం వంటి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అంటున్నారు.
ప్రధానంగా సంక్షేమంపై మరింత బడ్జెట్ కేటాయిస్తామని చెబుతున్నారు.రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రస్తుత హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సిందే.
వీటికయ్యే మొత్తం ఖర్చెంతో, ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు ఆర్థిక శాఖ అధికారులు.లక్షలోపు పంట రుణాల హామీనిచ్చింది టీఆర్ఎస్.
ఇక ప్రజాకూటమి అయితే, రెండు లక్షలంటోంది.అంటే కేవలం రైతుల రుణమాఫీ కోసమే 25 వేల కోట్లు అవసరమవుతాయని, అధికారుల అంచనా.
దీంతో బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడకతప్పదని అంటున్నారు.

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఆసరా పెన్షన్లు రెట్టింపవుతాయి.ప్రస్తతం 5,600 కోట్లు ఖర్చు చేస్తున్నారు.రెట్టింపయితే, 11,200 కోట్లు అవసరం పడతాయి.
ఇక కొత్తగా నిరుద్యోగభృతి కూడా చేర్చేసారు.నిరుద్యోగ భృతికి మరో 4 వేల కోట్లు కావాలి.
మహిళా గ్రూపులకు లక్ష చొప్పున చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.టీఆర్ఎస్ కూడా వరాలు కురిపించింది.
ఇందుకు గాను 4 వేల కోట్ల అదనపు నిధులు అవసరం.ఎలా చూసినా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్‌కు అదనంగా 60 వేల కోట్లు సమకుర్చుకోవాల్సి ఉంటుందని అధికారుల అంచనా.
మరి ఇంత భారీ నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనే ప్రశ్నకు సమాధానం కనిపించడంలేదు.ఉన్న అప్పులకు అదనంగా మరిన్ని అప్పులు చేస్తే తప్ప ఈ హామీలు నెరవేరే అవకాశం అయితే కనిపించడంలేదు.







