ఏపీలో విపక్ష వైసీపీ నుంచి అధికార పార్టీ టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికే 17 మంది దాకా వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు.
తాజాగా నెల్లూరు జిల్లా నుంచి వైసీపీకి చెందిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (కావలి) టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలతో దఫదఫాలుగా చర్చలు జరిపిన రామిరెడ్డి పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ నెల 6న రామిరెడ్డి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయినట్లు సమాచారం.
ఈ సందర్భంగా టీడీపీలో చేరే విషయాన్ని రామిరెడ్డి ప్రతిపాదించారు.
అందుకు చంద్రబాబు కూడా సరేననడంతో పాటు రామరెడ్డితో మాట్లాడాలనని ఆయన మంత్రి నారాయణకు సూచించారు.ఈ క్రమంలో నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలు రామిరెడ్డితో విడతల వారీగా చర్చలు జరిపారు.
ఈ చర్చల్లో ఒకటి అరా డిమాండ్లు మినహా మిగిలిన అన్నింటి విషయంలో రామిరెడ్డికి గట్టి హామీ లభించడంతో సైకిలెక్కేందుకు ఆయన సిద్ధమైనట్లు సమాచారం.చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల 18న రామిరెడ్డి టీడీపీలో చేరనున్నారు.
రామిరెడ్డి పార్టీ మారితే… నెల్లూరు జిల్లాలోనే వైసీపీకి హ్యాండిచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరుతుంది.ఆ జిల్లాకు చెందిన గూడురు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన విషయం తెలిసిందే.







