ఏపీ అధికార పార్టీ వైసీపీలో టికెట్లు పంచాయతీ పెద్ద గందరగోళం గానే మారింది .జగన్ కు అత్యంత సన్నిహితులైన వారిలో పార్టీ కీలక నాయకులుగా వ్యవహరిస్తున్న వారిలో అనేక మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు.
ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ? ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉంది అనే విషయాలను జగన్ తెలుసుకుంటున్నారు.దానికి అనుగుణంగానే ఇప్పుడు భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే అనేకమంది నియోజకవర్గ ఇన్చార్జీలు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త ఇన్చార్జిలను నియమించారు.భారీ స్థాయిలోనే ఈ మార్పు చేర్పులు త్వరలో ఉండబోతుండడంతో ఎవరికి సీటు దక్కుతుంది అనేది టెన్షన్ గా మారింది.
ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మార్పు చేర్పుల వ్యవహారం పెద్ద గందరగోళంగా మారింది.చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కుప్పం మిగిలిన 13 చోట్ల వైసిపిని గెలిచింది.
ఈ 13 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎస్సి కాగా , మిగిలిన పది నియోజకవర్గాలు జనరల్ కేటగిరి అభ్యర్థులు గెలుపొందగా. ఏడు చోట్ల రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎమ్మెల్యేలు గా ఎన్నికయ్యారు.
వీరిలో ఎక్కువమంది జగన్ కు సన్నిహితులు కావడంతో వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఖాయమనే నమ్మకంతో ఉన్నారు అయితే ఇటీవల చేపట్టిన మార్పు చేర్పుల వ్యవహారంపై వీరందరిలోనూ టెన్షన్ మొదలైంది.జగన్ కు అత్యంత సన్నిహితులు, కీలకమైన వారిని తప్పిస్తూ ఉండడంతో తమ సీటు ఉంటుందా లేదా అనే గందరగోళం వీరిలో నెలకొంది.
ప్రస్తుతం ఈ జిల్లాలో ఒకరిద్దరు మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ మార్పులు తప్పవనే సంకేతాలు వీరిని మరింతగా టెన్షన్ పెడుతుంది.ఈ జిల్లాలో పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబాలపల్లి నుంచి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , కుప్పం నుంచి ఎమ్మెల్సీ భరత్, శ్రీకాళహస్తి నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి మరోసారి పోటీ కి దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి టికెట్ ఖరారు అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సీటును తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష బీసీ మహిళా కోటాలో ఆశిస్తున్నారు.నగరి నియోజకవర్గంలో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆర్కే రోజా విషయంలో వైసీపీ తర్జన భర్జన పడుతోంది సర్వేలో రోజాకు అనుకూల పరిస్థితులు లేకపోవడం దీనికి తగ్గట్లుగానే ఈ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉండటం తో రోజా కు ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్ దక్కదని ప్రచారం ఆ పార్టీ నేతల మధ్యనే జరుగుతోంది.