కారణం ఏదైతేనేమి ఇప్పుడు వరుస వరుసగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు మీద కేసులు నమోదవుతున్నాయి.టీడీపీ లో ఉన్న పెద్ద తలకాయలన్ని ఏ క్షణాన ఏమి జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు.
పార్టీ పరిస్థితి చూస్తే ఇప్పట్లో పుంజుకునేలా లేదు పైగా ప్రభుత్వం మీద ఎవరు గొంతెత్తినా వారి లొసుగులన్నీ తవ్వి తీసేస్తున్నారు.ఈ విధంగానే మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ కూన రవి కుమార్, కారణం బలరాం తదితరులంతా కేసుల్లో ఇరుక్కున్నారు.
ప్రస్తుతం ఏపీలో హాట్ హాట్ గా రాజధాని విషయంపై రగడ జరుగుతోంది.రాజధాని ముంపు ప్రాంతంలో ఉందని, ఇక్కడ నిర్మాణాలు చేయడం అంత శ్రేయస్కరం కాదు అంటూ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించినప్పటి నుంచి టీడీపీ నేతలు ప్రభుత్వం పై విమర్శలు పెద్ద ఎత్తున చేస్తున్నారు.
కానీ గత టీడీపీ ప్రభుత్వంలో రాజధాని వ్యవహారాల్లో అన్నీ తానై నడిపించిన అప్పటి పురపాలక మంత్రి నారాయణ ఈ విషయంలో సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశం అయ్యింది.

టీడీపీ అధినేత చంద్రబాబు కు నారాయణ అత్యంత సన్నిహితుడిగా, వివాదరహితుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నాడు.2014కు ముందు చంద్రబాబు నిర్వహించిన వస్తున్నా మీకోసం పాదయాత్రకు నిధులు కూడా ఈయనే సమర్పించినట్టు టాక్ కూడా ఉంది.ఆ తర్వాత 2014లో బాబు ప్రభుత్వం కొలువుతీరగానే ఆయనను ఎమ్యెల్సీని చేసి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
అప్పుడే నారాయణ రాజకీయంగా అందరికీ పరిచయమయ్యారు.వాస్తవానికి అప్పటి వరకు కూడా ఆయనను నారాయణ విద్యాసంస్థల అధినేతగానే అందరూ చూశారు.
ఇక చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో నారాయణకు కీలక బాధ్యతలు అప్పగించారు.అనేక దేశాలు తిరిగి, అక్కడి రాజధానులను పరిశీలించి, వాటి ప్రకారం అమరావతిని మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని నారాయణ చేసిన అన్ని ప్రయత్నాలను బాబు ప్రోత్సహించారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి టీడీపీ టికెట్ తెచ్చుకుని పోటీకి దిగారు.అయితే ఆయన్ను పరాజయమే వెంటాడింది.కేవలం 1200 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.ఆ తరువాత మాత్రం పార్టీ కార్యక్రమాలకు, ఇటు మీడియా ముందుకు కూడా రావడం మానేశారు.రాజధాని అమరావతి విషయంలో పెద్ద ఎత్తున రాజకీయ రగడ సాగుతోంది.అదే సమయంలో రాజధాని ముంపు ప్రభావిత ప్రాంతమని, ఇక్కడ కడితే మునిగిపోతుందని కూడా ఆరోపిస్తున్నారు.
మరి ఈ సమయంలో రాజధానిపై అన్నీబాగా తెలిసిన నారాయణ కనీసం నోరు కూడా విప్పడంలేదు.పార్టీ తరఫున కానీ, వ్యక్తిగతంగా కానీ ఆయన ఏ ఒక్క ప్రకటన కూడా చేయలేదు.
దీనికి కారణం కేసుల భయమే అని అంతా అంచనా వేస్తున్నారు.అదీకాకుండా ఆయనకు ఉన్న విద్య, వ్యాపారాలు వాటిపై వచ్చే వివాదాలు ఇవన్నీ ఎక్కడ తవ్వి తీస్తారో అన్న ఆందోళన ఆయనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆయన ఎంత సైలెంట్ గా ఉన్నా ఇప్పుడు తరువాత వరుసలో నారాయణే ఉన్నట్టు వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.