ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను తన కంచుకోటలుగా మార్చుకొని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ కు దాదాపు పది సంవత్సరాలు పాటు తెలుగు రాష్ట్రాల మొహం చాటేసాయి.ముఖ్యంగా తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ దాదాపు భూస్థాపితం అయిపోయింది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి పుణ్యమా అంటూ అధికారంలోకి రాగలిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తుపై మాత్రం ఇప్పటికీ ఏ విధమైన ఆశలూ లేవు .అయితే ఇప్పుడు ఎన్నికల లక్ష్యంగా అధికార వైసిపి చేస్తున్న మార్పులు కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం పోసే అవకాశం ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.ఎందుకంటే ఇప్పటికే 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కనీసం 50 నుంచి 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ మారుస్తారని ప్రచారం జరుగుతూ ఉండగా ప్రతిపక్ష పార్టీలైన జనసేన తెలుగుదేశం పార్టీలకు వారిని చేర్చుకునే అవకాశం కూడా కనిపించడం లేదు.ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలలో టికెట్ల కోసం భారీ ఎత్తున క్యూ ఉంది.
ఇప్పుడు అలా టికెట్లు దొరకని వారందరికీ కాంగ్రెస్ మాత్రమే ఏకైక ఆప్షన్ గా కనిపించే అవకాశం కనిపిస్తుంది .ఎందుకంటే బారతీయ జనతా పార్టీకి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో నోటా తో పోటీపడే ఓట్ల శాతం మాత్రమే ఉండడంతో ఒకప్పుడు అధికారం చాలాయించిన పార్టీ అయిన కాంగ్రెస్ వైపే ఆయా నేతలు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతుంది .

దాంతో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కాంగ్రెస్కు ఊపిరి పోసే అవకాశం ఉందని తెలుస్తుంది.దాంతో పాటు కేంద్ర కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి షర్మిల అంగీకరించారన్న వార్తలు వస్తున్న దరిమి లా ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ మరోసారి కీలకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది.మరి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ఏ పార్టీ అవకాశాలను దెబ్బతీస్తుందో వేచి చూడాలి.