తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తిరిగి తన సొంత నియోజకవర్గం అంబర్ పేట నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోటీ చేయనున్నారా? అనే వార్త ప్రస్తుతం పొలిటకల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.రాష్ట్రంలో ఒకవేళ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే.కిషన్ రెడ్డి తన ఎంపీ స్థానానికి, కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి తిరిగి అంబర్ పేట్ నుంచి పోటీచేస్తారా? లేదా తన కుటుంబ సభ్యులను భరిలోకి దించుతారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
బలమైన నేతల కోసం బీజేపీ చూపు
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ చూస్తోంది.అందుకోసం బలమైన నేతలను బరిలోకి దింపాలని చూస్తోంది.గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి కేవలం వెయ్యి ఓట్ల స్వల్ప తేడాతే అంబర్ పేట టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ పై ఓటమి చెందారు.
అంతేకాకుండా బీజేపీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది.గోషా మహల్ నుంచి రాజాసింగ్ ఒక్కడే బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు.కానీ ఎంపీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఏకంగా నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది.ఈ క్రమంలోనే ఈసారి కూడా బలమైన నేతలను బరిలోకి దించి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర, కేంద్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.

గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అన్ని చోట్ల ఓటమి పాలయ్యారు.119 నియోజకవర్గాల్లో దాదాపు 107లో బీజేపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి.కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీని బీట్ చేసేలా బీజేపీ కనిపిస్తోంది.ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నారు.టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు.తమకు ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు.
దీనికి తోడు హిందూ ఓటు బ్యాంక్ పొలరైజేషన్ విషయంలోనూ బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది.

ఇప్పటికే జిల్లాల్లో పర్యటనలు పూర్తి చేసిన బండి సంజయ్ ఇప్పుడు జంటనగరాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిన మాదిరిగా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది.
హైదరాబాద్ లో బీజేపీ అధికారంలోకి వచ్చే ఏరియాలు కొన్ని ఉన్నాయి.గోషామహల్, అంబర్ పేట, ఉప్పల్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో బీజేపీకి బలం ఉంది.అంబర్ పేట్‌లో కిషన్ రెడ్డి బీజేపీ తరఫున 2009, 2014లో గెలుపొందిన విషయం తెలిసిందే.2018లో టీఆర్ఎస్ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు.అందుకే కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి అంబర్పేటపై ఫోకస్ పెట్టారట.వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎలాగైనా బీజేపీ జెండా పాతాలని చూస్తున్నారట.