తెలంగాణ బిజెపి నేతలు బాగా యాక్టివ్ అయ్యారు.పార్టీ అధికారంలోకి వస్తుందనే బలమైన నమ్మకంతో ఉన్నారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలకు మొహం మొత్తింది అని, అందుకే బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు.ఎలాగూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రంగా ఉంది కాబట్టి, రాబోయే ఎన్నికల్లో అవకాశం దక్కుతుందని నమ్ముతున్నారు.
ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రకు జనం నుంచి విశేష స్పందన వచ్చింది.యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి భారీగా జనసమీకరణ చేయడంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సక్సెస్ అయ్యారు.
మిగతా పార్టీ నేతలకు సరైన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్తున్నారు.
దీంతో పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ఇంత వరకు బాగానే ఉన్నా… తెలంగాణ బీజేపీ లో చేరికలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.
టిఆర్ఎస్ కు రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీ అనే భావన అందరిలో ఉన్నా.పెద్దగా చేరికలు చోటు చేసుకోకపోవడం ఆ పార్టీ నాయకులను నిరాశపరుస్తుది.
ఇప్పటికే ఎంతో మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా… వారికి టికెట్ హామీ లభించకపోవడం తమ వెంట తీసుకొచ్చిన వారికి సరైన ప్రాధాన్యం ఇస్తామని హామీ లభించక పోవడం తదితర కారణాలతో చేరికలు అంతంతమాత్రంగానే చోటుచేసుకుంటున్నాయి.టిఆర్ఎస్.
కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు.ఎంపీలు .మాజీ మంత్రులు ఇలా చాలా మంది బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

కానీ పార్టీ కండువా కప్పుకునే సమయంలోనే తమకు టికెట్ హామీ ఇవ్వాలని షరతులు విధిస్తుండడంతో, దీనిపై స్పష్టమైన హామీని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇవ్వలేకపోతున్నారు.దీనికి కారణం పార్టీలో చేరికల సందర్భంగా ఎవరికీ టికెట్ల హామీ ఇవ్వొద్దు అని, ఎటువంటి షరతులు లేకుండానే పార్టీలో చేర్చుకోవాలని అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఈ విషయంలో బండి సంజయ్ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.ఈ కారణంతోనే బిజెపిలో చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయట.