అదేంటి! అనుకుంటున్నారా ? ఔను.ఇప్పుడు టీడీపీ బాటలోనే వైసీపీ నడవనుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
గుంటూరుకు చెందిన ఓ కీలక నాయకుడు, వైసీపీ పొలిట్ బ్యూరోలో కీలక రోల్ పోషిస్తున్న నాయకుడు ఆఫ్ ది రికార్డుగా చెప్పిన మాటలను బట్టి.కేంద్రం విషయంలో వైసీపీ యూటర్న్ తీసుకుంటుందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు కేంద్రం విషయంలో సానుకూల ధోరణిని అవలంబిస్తున్న జగన్ ఎంపీలు ఇప్పుడు యూటర్న్ తీసుకుని.ఏపీ ప్రయోజనాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు సదరు నాయకుడు పేర్కొన్నారు.
మా నాయకుడు కూడా ఆలోచిస్తున్నారు.ఇప్పటి వరకు కేంద్రాన్ని ప్లీజ్ అన్నాం.అయినా కూడా కీలక విషయాల్లో తప్పించుకుంటోంది.బడ్జెట్ చూశారుగా ఇంత కన్నా అన్యాయం ఏముంటుంది.
మా నాయకుడే నేరుగా వెళ్లి నిర్మలను కలిశారు.హోం మంత్రిని కలిశారు.
న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసారు.ప్రధానితోనూ భేటీ అయ్యారు.
అయినా ఒక్క విషయంలోనూ స్పందించడం లేదు.సహకరించడం లేదు.
ఇలానే ఉంటే ఎన్నికల సమయానికి ఇబ్బంది తప్పదని `మేం` చెప్పాం.దీనికి మా నాయకుడు కూడా అంగీకరించారు“ అని సదరు నాయకుడు పాత్రికేయులతో చెప్పిన మాట హల్‌చల్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఇకపై టీడీపీ అనుసరించిన బాటలోనే వైసీపీ కూడా నడుస్తుందని ఆయన ఆఫ్ ది రికార్డుగా చెప్పారు.అయితే టీడీపీ మాదిరిగా తాము రోడ్డెక్కి మోడీపైన, బీజేపీపైన విమర్శలు చేసేది లేదని ఎక్కడ ఎలా స్పందించాలనే విషయంపైనా.ఏపీ హక్కులు సాధించాలనే అంశంపైనా మరోసారి పొలిట్ బ్యూరోలో చర్చించాలని నిర్ణయించామని తెలిపారు.వచ్చే నెలలో జరగనున్న పార్లమెంటు మలి విడత సమావేశాల నుంచి మా వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది అని ఆయన వివరించారు.
దీనిని బట్టి ఏపీ ప్రయోజనాలపై ఇప్పటి వరకు వైసీపీ అనుసరించిన వ్యూహం మారుతుందని తెలుస్తోంది.మరి ఏం చేస్తారో బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.