అనకాపల్లి: న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే విశాఖను పరిపాలన రాజధానిగా చేసి తీరుతామని ఉమ్మడి విశాఖ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పష్టంచేశారు.అనకాపల్లి జిల్లా వైసీపీ కార్యకర్తల సమావేశం మంగళవారం అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైవి సుబ్బా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు.అధికార వికేంద్రీకరణలో భాగంగా సచివాలయాలు ఏర్పాటు, జిల్లాల విభజన వంటి అనేక చారిత్రక నిర్ణయాలు జగన్మోహనరెడ్డి తీసుకున్నారని ఆయన చెప్పారు.
దీనివలన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.మూడు రాజధానులపై వాస్తవాలను అవాస్తవాలుగా చూపించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు.ఈ ప్రాంతo అభివృద్ధికి చెందకుండా ఉండేందుకు చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రలను ప్రజల అందరికీ తెలియజేసే బాధ్యత కార్యకర్తలపై ఉందని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.
ఈ ప్రాంతం పైకి దండయాత్ర గా వస్తున్న వారికి శాంతియుతంగా నిరసన తెలియ చేయాలని ఆయన కోరారు.అభివృద్ధి కాంక్షించే ఈ ప్రాంత ప్రజలు చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రలను సహించబోమని ఆయన అన్నారు.
దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కాని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజలకు అందజేస్తూ ఉంటే, వాటిని అడ్డుకునేందుకు చంద్రబాబునాయుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని సుబ్బారెడ్డి అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 98.5 శాతం అమలు చేశామని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం ఇస్తే సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తాడని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇచ్చిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీని గెలిపించాలని ఆయన కోరారు.త్వరలోనే తాను కూడా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటానని సుబ్బారెడ్డి తెలియజేశారు.
ఇదిలా ఉండగా వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ ని ఎంపిక చేశామని అతనిని గెలిపించే బాధ్యతను కార్యకర్తలు, నాయకులు తీసుకోవాలని సుబ్బారెడ్డి కోరారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధానిగా అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఈ ప్రాంతానికి మేలు జరగకూడదన్న దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు దండయాత్ర సాగిస్తున్నారని, ఈ ప్రాంతంపై మమకారం ఉన్నవారు, విజ్ఞులు దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.పాదయాత్ర పేరుతో ఈ ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొడతారన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు.
యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు.అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని అమర్నాథ్ తెలియజేశారు.
పాదయాత్ర పేరుతో చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు.ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుధాకర్ ను జగన్మోహన్రెడ్డి బలపరచాలని అఖండ మెజార్టీతో ఆయనను గెలిపించాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ విప్ ధర్మశ్రీ మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియలో కార్యకర్తలు, నాయకులు కీలక పాత్ర పోషించాలని కోరారు.ఇందుకోసం ఈనెలాఖరులోగా గ్రామ కమిటీల నియామక ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా తీర్మానం చేశారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, అనకాపల్లి ఎంపీ సత్యవతమ్మ, ఎమ్మెల్యేలు కన్నబాబు రాజు, గొల్ల బాబురావు, ఉమాశంకర్ గణేష్, తదితరులు పాల్గొన్నారు.