తెలుగు, తమిళ భాషల్లో పాపులారిటీని సొంతం చేసుకున్న కమెడియన్లలో వివేక్ ఒకరు.కొన్ని నెలల క్రితం వివేక్ గుండె పోటుతో మృతి చెందారు.
అయితే వివేక్ చనిపోవడానికి రెండు రోజుల ముందే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంతో వ్యాక్సిన్ వల్లే అతనికి గుండెపోటు వచ్చిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఆరోగ్య శాఖ అధికారులు గతంలోనే ఆ వార్తలను ఖండించినా కొంతమంది మాత్రం వ్యాక్సిన్ విషయంలో అనుమానాలను వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ వికటించడం వల్లే వివేక్ చనిపోయి ఉండవచ్చని ఎక్కువగా వార్తలు ప్రచారంలోకి రావడం గమనార్హం.అయితే తమిళనాడు రాష్ట్రంలోని విజుపురంకు చెందిన సామాజిక కార్యకర్తలలో ఒకరు వివేక్ మృతికి సంబంధించి ఆయన మరణించిన సమయంలో మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ ను దాఖలు చేశారు.
వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే వివేక్ చనిపోయారా? అనే కోణంలో విచారణ జరపాలని సామాజిక కార్యకర్త పిటిషన్ లో కోరారు.

అయితే ఈ పిటిషన్ గురించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విచారణ జరపడంతో పాటు తాజాగా పిటిషన్ కు సంబంధించి స్పష్టత ఇచ్చింది.వివేక్ చనిపోవడానికి ముందు వ్యాక్సిన్ తీసుకోవడం వాస్తవమేనని అయితే వివేక్ మృతికి, వ్యాక్సిన్ కు ఎటువంటి సంబంధం లేదని అధికారులు వెల్లడించారు.అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ కమిటీ ఈ మేరకు వివరణ ఇవ్వడం గమనార్హం.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధారాలతో సహా వివరణ ఇవ్వడంతో ఇకనైనా ఈ తరహా ప్రచారం ఆగుతుందేమో చూడాల్సి ఉంది.వివేక్ మరణవార్త ఎంతోమంది అభిమానులను భాధ పెట్టింది.శంకర్ సినిమాలలోని పాత్రలు వివేక్ ను కమెడియన్ గా మరో మెట్టు పైకి ఎక్కించాయి.అపరిచితుడు, శివాజీ సినిమాలలోని పాత్రలు వివేక్ కు కమెడియన్ గా మంచి పేరును తెచ్చిపెట్టాయి.