ఓటర్ దరఖాస్తులను ఎలక్షన్ కమీషన్ మార్గదర్శకాలకు లోబడి పరిష్కరించాలి

ఎన్నికల నిర్వహణ సన్నద్ధపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓటర్ దరఖాస్తులను ఎలక్షన్ కమీషన్ మార్గదర్శకాలకు లోబడి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ( Collector Anurag Jayanthi )సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ , జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.

రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, రెండవ ఓటరు జాబితా సవరణ పెండింగ్ దరఖాస్తులు, జిల్లా ఎన్నికల ప్రణాళిక రూపకల్పన, ఓటరు గుర్తింపు కార్డుల ( Voter ID Card )పంపిణీ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు.అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, రెండవ ఓటరు జాబితా సవరణలో భాగంగా వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత సమయంలోగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించాలని, వీటిపై ఈ.ఆర్.ఓ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు.ఎన్నికల నిమిత్తం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారులు ఒకసారి పరిశీలించి ధ్రువీకరించుకోవాలని, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటుపై తుది ప్రతిపాదనలు క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ అవసరమైన మౌళిక వసతులు ఉన్నాయా, లేవా పరిశీలించి నివేదిక నిర్దేశిత సమయంలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు‌.జిల్లాలో యువత, దివ్యాంగులు మహిళల కోసం ప్రత్యేక మోడల్ పోలింగ్ కేంద్రాల( Model Polling Stations ) ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.

పెండింగ్ లో ఓటరు నమోదు దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని, రెండవ విడత ఓటరు జాబితా సవరణలో భాగంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ వీడియో సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు ఆనంద్ కుమార్,మధు సూదన్, జిల్లా అధికారులు శ్రీనివాస చారి, రఫీ, స్వీప్ నోడల్ అధికారి నర్సింహులు సి విభాగం సూపరిండెంట్ శ్రీకాంత్ , ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News