సినిమా హీరోలు, స్పోర్ట్స్ స్టార్లపై అభిమానం ఉండటం మంచిదే.కానీ వారిపై పిచ్చి అభిమానం పెంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదకరమే.
తాజాగా ఇలాంటి పిచ్చి అభిమానంతో ఒక యువకుడు తన స్నేహితుడిని చంపి కటకటాలపాలయ్యాడు.ఈ ఘోరమైన సంఘటన తమిళనాడులోని అరియలూర్ జిల్లాలోని పొయ్యూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
తన అభిమాన క్రికెటర్ల గురించి హీనంగా మాట్లాడినందుకు ఈ క్రికెట్ అభిమాని తన స్నేహితుడిని హత్య చేసి అందరికీ షాకిచ్చాడు.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.
మల్లూరు సమీపంలోని సిడ్కో ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఒక బహిరంగ ప్రదేశంలో మంగళవారం రాత్రి విఘ్నేష్ (24), ధర్మరాజ్ (21) అనే ఇద్దరు స్నేహితులు క్రికెట్ గురించి మాట్లాడుకున్నారు.ఆ సమయంలో ఇద్దరూ మద్యం సేవించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విఘ్నేష్ ముంబై ఇండియన్స్‌కు మద్దతు ఇస్తున్నాడు.ధర్మరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి సపోర్ట్ చేస్తున్నాడు.
కాగా ఆ టైమ్‌లో విఘ్నేష్ ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీని ఎగతాళి చేశాడు.నత్తిగా మాట్లాడే ధర్మరాజును బాడీ షేమ్ చేయడం విఘ్నేష్‌కు అలవాటు.
ఆ రోజు కూడా ఆర్‌సీబీ జట్టును ధర్మరాజ్ నత్తితో పోలుస్తూ దారుణమైన కామెంట్ చేశాడు.దీంతో కోపోద్రిక్తుడైన ధర్మరాజ్ విఘ్నేష్‌పై బాటిల్‌తో దాడి చేసి క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టాడు.
అనంతరం అక్కడి నుంచి ఉడాయించాడు.
ఆ దెబ్బలు బాగా తగలడంతో విఘ్నేష్ అక్కడికక్కడే మరణించాడు.సిడ్కో ఫ్యాక్టరీలో పనిచేసే స్థానికులు విఘ్నేష్ మృతదేహాన్ని మొదటగా చూసి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆపై నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.ఈ విషయం తెలిసి చాలామంది అయ్యో పాపం అంటున్నారు.
అభిమానం మరీ చచ్చిపోయేంత లేదా చంపేంత స్థాయిలో ఉండకూడదని హితవు పలుకుతున్నారు.