భారతదేశంలో వైద్యరంగానికి సంబంధించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే అంశంపై దృష్టి పెట్టాలని ఎన్ఆర్ఐ వైద్యులకు సూచించారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.అమెరికాలో ఉంటున్న భారత సంతతి వైద్యుల సంఘం (ఆపి) 38వ వార్షిక సదస్సును ఉద్దేశించి శనివారం ఆన్‌లైన్ వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.
భారతదేశంలో ప్రతిఒక్కరికీ అందుబాటు ధరల్లో వైద్యం అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరముందని వెంకయ్య నాయుడు సూచించారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సృష్టించిన అవాంతరాలను, అడ్డంకులను, అవకాశాలుగా మలచుకుని డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ సహాయంతో వైద్యరంగంలో సంస్కరణలు తీసుకోవాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో ప్రజావైద్య రంగంలో సవాళ్లతో పాటు విస్తృతమైన అవకాశాలు కూడా ఉన్నాయని ఉపరాష్ట్రపతి చెప్పారు.
స్వాతంత్ర్యం పొందిన తర్వాత వైద్య రంగంలో ఇండియా ఎన్నో మైలు రాళ్లను అధిగమించిందని వెంకయ్య నాయుడు గుర్తుచేశారు.
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, ఫార్మాస్యూటికల్, బయో టెక్నాలజీ పరిశ్రమలు, క్లినికల్ ట్రయల్స్ పరిశ్రమలతో పాటు విదేశీ రోగులను సైతం భారత్ ఆకర్షిస్తోందని ఉప రాష్ట్రపతి తెలిపారు.వైద్య రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం వుందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ప్రాథమిక వైద్య వ్యవస్థ బలంగా వున్న దేశాలు చక్కటి ఫలితాలు సాధిస్తున్నాయని ఉపరాష్ట్రపతి చెప్పారు.వైద్య విద్య, పరిశోధనల్లో సమన్వయం, దేశంలోని వైద్య నిపుణులతో కలిసి పనిచేయడం ద్వారా వైద్య ప్రమాణాలను పెంచడం తదితర అంశాల్లో విదేశాల్లోని భారత సంతతి వైద్యులు చొరవతీసుకోవాలని ఉప రాష్ట్రపతి సూచించారు.
తద్వారా ఆత్మనిర్భర భారత నిర్మాణంలో తమవంతు పాత్ర పోషించాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.పారిశుధ్యం, పౌష్టికాహారం వంటి విషయాల్లో వివిధ దేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులను ఎన్నారై డాక్టర్లు భారతదేశంలోని వైద్యనిపుణులతో పంచుకోవాలని ఉప రాష్ట్రపతి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆపీ అధ్యక్షుడు డాక్టర్ సురేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.