మొగిలిపాకలో వెటర్నరీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా:మొగిలిపాక గ్రామంలో వెటర్నరీ హాస్పిటల్ ను వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,జిల్లా నాయకులు మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మొగిలిపాక గ్రామంలో మొగిలిపాక గోపాల్ అధ్యక్షతన జరిగిన సిపిఎం 13వ శాఖ మహాసభలో వారు మాట్లాడుతూ మొగిలిపాక గ్రామంలో వెటర్నరీ హాస్పిటల్ అందుబాటులో లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, పశువులతోపాటు గొర్రెలు, మేకలకు వివిధ రకాల వ్యాధులు సోకినప్పుడు వెటర్నరీ డాక్టర్ అందుబాటులో లేక ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి వెటర్నరీ హాస్పిటల్ ఏర్పాటు చేసి, డాక్టర్ ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.అదేవిధంగా గ్రామంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రవేశపెట్టి పాఠశాల మూతపడకుండా కాపాడాలని,పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండే విధంగా చూడాలని, వెలువర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు అనుసంధానంగా మొగిలిపాకలో సబ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని,గ్రామంలోని పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, అర్హులుగా ఉండి రేషన్ కార్డులు,పెన్షన్లు లేని పేదలందరికీ రేషన్ కార్డులు,పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం నూతన కార్యదర్శిగా గుండెపురి నరసింహను ఎన్నుకోవడం జరిగింది,ఈ మహాసభలో సిపిఎం శాఖ సహాయ కార్యదర్శి సంగి శ్రీనివాస్ నాయకులు మొగిలిపాక జంగయ్య,మర్ల నరసింహ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి చరిత్ర తెలియని ముఖ్యమంత్రి : మాజీ ఎమ్మెల్యే బొల్లం
Advertisement

Latest Yadadri Bhuvanagiri News