సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో 65వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.రాత్రి వేళ రోడ్డుపై అడ్డంగా వెళుతున్న గేదెలను గమనించక ఓ ద్విచక్ర వాహనం గేదెలను ఢి కొట్టింది.
దీనితో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు కింద పడిపోయారు.వెనుక నుండి వేగంగా వస్తున్న కారు వారిపై నుండి దూసుకెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా,ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన మండవ రవి (20)మండవ నరహరి(21)మరో యువకుడు(22) కలిసి బైక్ పై బంధువుల వివాహ వేడుకకు వెళ్లి రాత్రి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు చెబుతున్నారు.ఈ ప్రమాదంలో మండవ రవి(20),అక్కడిక్కడే మృతి చెందగా,మండవ నరహరి (21) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.
బైక్ నదువుతున్న మరొక యువకుడు పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట,అక్కడికి నుండి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ హాస్పిటల్ కి తరలించారు.ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృత్యువాత పడడంతో కలకోవ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్ఐ బాలు నాయక్ తెలిపారు.వేసవి కాలంలో పశువులను వదిలేసే వారికి ఇప్పటికే హెచ్చరిక చేశామని చెప్పారు.
జాతీయ రహదారిపై వాహనాలు అత్యంత వేగంగా వస్తాయని,రాత్రిపూట రోడ్డుపైకి వచ్చే పశువులు ప్రమాదాలకు కారణమై ప్రాణనష్టం జరుగుతుందన్నారు.పశువులను వదిలే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.







