ఖమ్మం జిల్లా కీలక నేత, బీఆర్ఎస్ సీనియర్ తుమ్మల నాగేశ్వరావు( Tummala nageswararao ) ఆ పార్టీని వీడడం దాదాపుగా ఖాయం అయ్యింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మలకు గట్టి పట్టు ఉంది.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా ను ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉండడంతో, ఆయనను చేర్చుకునేందుకు బిజెపి , కాంగ్రెస్ లు పోటాపోటీ పడుతున్నాయి.ఇప్పటికే బీజేపీ నుంచి ఆహ్వానాలు అందాయి.
అయితే ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను బాగా అంచనా వేసిన తుమ్మల కాంగ్రెస్ లో చేరేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు .అలాగే తుమ్మల అనుచరులు కూడా కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఒత్తిడి తీసుకొస్తున్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న తుమ్మల దీనికి సంబంధించి ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నారు .అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
సెప్టెంబర్ ఆరో తేదీన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge ) సమక్షంలో కండువా కప్పుకోవాలని చూస్తున్నారు.ఒకవేళ అది కుదరని పక్షంలో రాహుల్ గాంధీ సమక్షంలోనైనా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ఇప్పటికే తన అనుచరులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఇక బీఆర్ఎస్ సైతం తుమ్మల పార్టీని వీడకుండా బుజ్జగింపు ప్రయత్నాలు చేపట్టింది.ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామనే హామీను కూడా ఇచ్చింది.అయితే కేసీఆర్ తనకు నమ్మకద్రోహం చేశారని, తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు దాదాపుగా డిసైడ్ అయిపోయారు.అయితే నియోజకవర్గ విషయంలో కాంగ్రెస్ నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
ఖమ్మం( Khammam ) లేదా పాలేరు ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి తుమ్మల పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా, పాలేరు నియోజకవర్గం పైనే ఆయన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.
కాంగ్రెస్ అనూహ్యంగా మరో ప్రతిపాదన కూడా తీసుకు వచ్చినట్లు సమాచారం.ఈ మేరకు హైదరాబాదులోని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఆయనను పోటీకి దించాలని చూస్తున్నారట.దీనికి కారణం ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండటమే కారణమట .అయితే కూకట్ పల్లి పై తుమ్మల అంత ఆసక్తి చూపించడం లేదట.తనకు పాలేరు నియోజకవర్గం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ లో తుమ్మల చేరడం ఖాయం అయినా, నియోజకవర్గ విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది.