ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరికను జారీ చేసింది.అసలు సంగతి ఏంటంటే ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్ అవలంభించడం ద్వారా మోసం జరిగే అవకాశం ఉందని ట్రంప్ చేసిన ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకోవాలని తన వినియోగదారులకు ట్విట్టర్ సూచించింది.
అయితే ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్షుడిని సాధారణ ఖాతాదారుల విషయంలో పాటించే నిబంధనల్ని ట్రంప్‌కు వర్తింపజేసేందుకు ట్విట్టర్ నిరాకరించింది.ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
అసలు మ్యాటర్ ఇది: నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఇందుకోసం ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా మెయిల్ ఇన్ బ్యాలెట్ విధానాన్ని అవలంభించాలని కాలిఫోర్నియా గవర్నర్ నిర్ణయించారు.ఇందుకోసం నమోదు చేసుకున్న ఓటర్లకు ఇప్పటి నుంచే బ్యాలెట్ పేపర్లు పంపాలని ఆదేశించారు.ఆయన నిర్ణయాన్ని అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు.ఈ విధానంలో మోసం జరిగే అవకాశం ఉందని ట్రంప్ ఆరోపించారు.
అక్కడితో ఆగకుండా రిగ్గింగ్ అనే మాట కూడా వుపయోగించారు.మెయిల్ ఇన్ బ్యాలెట్ విధానంపై ట్రంప్ చేసిన ఆరోపణలు ఎంత వరకు నిజమో తెలుసుకోవాలంటూ ట్విట్టర్ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిక చేసింది.

ఇంతకీ మెయిల్ ఇన్ బ్యాలెట్ అంటే ఏంటని మీకు సందేహం రావొచ్చు… దానికి సమాధానం ఇదే.పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసే వెసులుబాటు లేని వారు ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు.అయితే దీని కోసం ముందుగానే ఓటరు రిజిస్టర్ చేసుకోవాలి.ఇలాంటి వారికి బ్యాలెట్ పేపర్‌ను అత్యంత భద్రతతో ఓ కవర్లో ఇంటికి పంపుతారు.ఓటరు తనకు నచ్చిన అభ్యర్ధి కాలమ్ వద్ద మార్క్ చేయాలి.అనంతరం ముందుగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కవర్లో పెట్టాలి.
ఆ తర్వాత దీనిని దగ్గరలో ఏర్పాటు చేసిన మెయిల్ బాక్స్‌లో గానీ, పోలింగ్ కేంద్రం వద్ద గానీ ఇవ్వాలి.ఈ ప్రక్రియలో అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తారు.
ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద లాక్డౌన్ నిబంధనలను పాటించే అవకాశం లేకపోవడంతో ఈ విధానం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.