బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ప్రభావం అన్ని ఇండస్ట్రీలపై ప్రభావం చూపించింది.ఇండస్ట్రీలో అవకాశాలు రానివారు, అలాగే ఇతర రంగాలలో సక్సెస్ సాధించలేని వారు ఆత్మన్యూనతా భావంతో ఓడిపోయామనే ఫీలింగ్ తో ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉన్నారు.
ఇలాంటి వారిలో కొంతైనా మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మన టాలీవుడ్ స్టార్స్ ఆత్మహత్యలకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.అమెరికా, భారత్ లో ఆత్మహత్యల నివారణ కేంద్రాల ఫోన్ నెంబర్లను తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకుంటున్నారు.
ఆయా ఫోన్ నెంబర్లకు కాల్ చేసి మాట్లాడితే కౌన్సెలింగ్ ఇస్తారని, తద్వారా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు తొలగిపోతాయని ప్రచారం చేస్తున్నారు.ఈ అంశంపై ఫోన్ నెంబర్లుని దర్శకుడు దేవా కట్టా పోస్టు చేసి హీరో సాయితేజ్ ను నామినేట్ చేశాడు.
సాయితేజ్ దీనిపై స్పందిస్తూ తన వంతుగా వెన్నెల కిశోర్, లావణ్య త్రిపాఠిలను నామినేట్ చేశాడు.ఆపై లావణ్య త్రిపాఠి ఈ చాలెంజ్ ను స్వీకరిస్తూ, మన బాధలు వినేవాళ్లు ఎవరో ఒకరు తప్పకుండా ఉంటారు అంటూ పోస్ట్ చేశారు.
ఈ చాలెంజ్ లో భాగంగా రీతూ వర్మ, రాహుల్ రవీంద్రన్ లను నామినేట్ చేశారు.మొత్తానికి ఇప్పటి వరకు సమాజానికి పనికిరాని చాలెంజ్ తో కాలక్షేపం చేసిన సెలబ్రిటీలు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారి ఆలోచనలు మార్చడానికి ప్రయత్నం చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం.