బళ్లు ఓడలు .ఓడలు బళ్లు అవ్వడం అంటే ఏంటో జనసేన, బీజేపీ పార్టీల విషయంలో మరోసారి రుజువైంది.
చెప్పుకోవడానికి పవన్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నా, రాజకీయపరంగా పవన్, జనసేన పార్టీ బలహీనంగా ఉన్నారని, ఏపీలో జనసేన కంటే బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉంది అని, తమతో పొత్తు పెట్టుకున్న జనసేన తన చెప్పుచేతల్లో ఉంటుందని, తాము కేటాయించిన సీట్లలో పోటీ చేస్తుందని, మిగతా చోట్ల తమ అభ్యర్థులకు మద్దతు ఇస్తుందని ఎన్నో లెక్కలు వేసుకుంటూ బీజేపీ వస్తోంది.ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీ పోటీ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఇక్కడ బిజెపి అభ్యర్థి పోటీలో ఉంటారు అని, జనసేన మద్దతు ఇస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు ప్రకటించేశారు.దీన్నిబట్టి జనసేన ప్రభావం ఏమీ లేదని, తాము ప్రకటించిన దానికి జనసేన కట్టుబడి ఉండటమే అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరశైలి కనిపించింది.
అయితే జనసేన మాత్రం తిరుపతి ఎన్నికలలో ఏదో రకంగా పోటీ చేయాలని, బీజేపీ ని ఒప్పించి తమ పార్టీ అభ్యర్థిని ఇక్కడ పోటీకి దించి గెలిచి చూపించాలనే కసితో ఉంది.అందుకే సొంతంగానే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పర్యటన చేశారు.
ఆ నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.బీజేపీ కంటే జనసేనకే ఇక్కడ బలం ఎక్కువగా ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నా, బీజేపీ మాత్రం జనసేన విషయంలో చిన్నచూపు చూస్తూనే వచ్చింది.
అయితే ఏపీ లో జరిగిన పంచాయతీ ఎన్నికలు పూర్తిగా బీజేపీ అభిప్రాయం తప్పని నిరూపించాయి.అసలు ఈ ఎన్నికలలో బిజెపి రెండు మూడు చోట్ల మాత్రమే ప్రభావం చూపించింది కానీ, జనసేన అనూహ్యంగా గ్రామ స్థాయిలో వందల సంఖ్యలో సర్పంచ్, వార్డు మెంబర్లు గెలుచుకుంది.
గ్రామస్థాయిలో జన సైనికులు బలం ఏమిటో నిరూపించుకుంది.

ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు జనసేన ఉత్సాహంగా ఉంది.బీజేపీలో గొప్పగొప్ప లీడర్లము అని చెప్పుకుంటున్న ఏపీ బీజేపీ నేతలు తమ సొంత ప్రాంతాల్లో బీజేపీని గట్టెక్కించలేకపోయారు.ఇప్పుడు జనసేనకు వచ్చిన మెరుగైన ఫలితాలతో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో జనసేనకే పోటీ చేసే అవకాశాన్ని కల్పించే అవకాశాలు ఉన్నట్లు గా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అలా కాదు అని బీజేపీ మొండిగా జనసేన ను పక్కన పెట్టి, ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమైతే దానికి తగిన మూల్యం చెల్లించుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉండాల్సిందే.కానీ బీజేపీ అంత సాహసం చేసే అవకాశం ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.