ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ముగియడంతో ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళన పైనే పూర్తిగా జగన్( Ys jagan ) దృష్టి సారించారు .ప్రస్తుతం మంత్రులలో చాలామంది పనితీరు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం, వీరితో ఎన్నికలకు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదు అనే ఉద్దేశంతో ఉన్న జగన్, మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టి కొంతమందిని మంత్రి పదవి నుంచి తప్పించి, మరికొందరికి మంత్రులుగా అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవల ఏపీ గవర్నర్ ను కలిసిన జగన్ అనేక అంశాలతో పాటు మంత్రివర్గ విస్తరణ పైన చర్చించారట.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించడంతో పాటు, మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న కీలకమైన వ్యక్తులకు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి అనుకూలంగా ఓటు వేయడంతో జగన్ అలర్ట్ అయ్యారు. పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు, మొదటి నుంచి తనను నమ్ముకుని ఉన్న వారికి ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించుకోవడంతో, ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళనపై జగన్ దృష్టి సారించారట.
సామాజిక వర్గాల సమీకరణ మాత్రమే కాకుండా, పనితీరు ఆధారంగా మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని జగన్ నిర్ణయించుకున్నారు.ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో, మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) కి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట.

అలాగే కడప జిల్లా నుంచి మంత్రిగా ఉన్న అంజద్ భాషను తప్పించి , ఆయన స్థానంలో గుంటూరు జిల్లా నుంచి ముస్తఫాకు అవకాశం ఇవ్వాలని , అలాగే కడప జిల్లా నుంచి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కి , నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి( Nallapareddy Prasanna Kumar Reddy ) కి అవకాశం కల్పించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో కొంతమందికి మంత్రి పదవులు దొరికే అవకాశం ఉన్నట్లుగా వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.