ఆచారాలు, సాంప్రదాయాలు ఉండే కొద్దీ కనుమరుగై పోతున్నాయి.ఒకప్పుడు పండగల సమయంలో పిండి వంటలు అనగానే పెద్ద వారంతా కలిసి వండేవారు.
ఆ ప్రక్రియ అంతా సందడిగా ఉండేది.వాటిని తయారు చేస్తున్నప్పుడే పిల్లలు వచ్చి రుచి చూసేవారు.
ఇక ప్రస్తుతం ఏ పండగ వచ్చినా ఎవరూ శ్రమపడడం లేదు.కావాల్సినవన్నీ ఆన్‌లైన్‌లో చకచకా ఆర్డర్లు పెట్టేస్తున్నారు.
కాళ్ల వద్దకే కావాల్సిన వస్తువులు రప్పించుకుంటున్నారు.అరిసెలు, కజ్జికాయలు, జంతికలు వంటి పిండి వంటలు, అరిటాకులు, ఇతర పండగ సామగ్రిని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి వాటి ద్వారా ఆర్డర్లు పెట్టి రప్పించుకుంటున్నారు.
ఆశ్చర్యకరంగా ప్రస్తుతం చింత పిక్కలను కూడా ఆన్‌లైన్‌లో విక్రయించేస్తున్నారు.వీటికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

సంక్రాంతి వచ్చిందంటే భోగి మంటల్లో పాత వస్తువులు, పిడకలు వేస్తూ ఉంటాం.ఒకప్పుడు వీటిని పండగకు వారం ముందే తయారు చేసే వాళ్లం.అయితే ప్రస్తుతం పిడకలు కూడా ఆన్‌లైన్‌లో అమ్మకానికి వచ్చేశాయి.వీటితో పాటు తాజాగా చింత పిక్కలను కూడా ధర నిర్ణయించి అమ్మేస్తున్నారు.సాధారణంగా చింత పండు రసం తీసిన తర్వాత వాటి పిక్కలను అంతా పడేస్తుంటారు.అలాంటి వాటిని కొందరు చక్కగా ప్యాకింగ్ చేసి రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు.

అయితే ఇందులో మరో ఆశ్చర్యకర విషయం కూడా ఉంది.ఆ ప్యాకెట్‌లలో కేవలం 100 చింత పిక్కలు మాత్రమే ఉంటాయి.అంటే ఒక్కో చింత గింజను రూపాయి కంటే ఎక్కువ ధరకే విక్రయిస్తున్నారు.
ప్రస్తుత ఆన్‌లైన్ యుగంలో ఆఖరికి చింత గింజలు కూడా వ్యాపార వస్తువుగా మారిపోయాయని అంతా చర్చించుకుంటున్నారు.







