సెల్ టవర్లను దొంగిలించడమేంట్రా బాబు అని అనుకుంటున్నారు కదూ.మీరు విన్నది నిజమే.
గతంలో ఇలాంటి ఓ వార్తను విని మర్చిపోక ముందే అలాంటి ఓ ఘటన ఇపుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది.బీహార్‌లో దొంగలు పట్టపగలు బ్రిడ్జిలను ఎత్తుకెళ్లిన ఘటనలు చూసి, విని విస్తుపోయాం.
ఇప్పుడు ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగు చూడటం కొసమెరుపు.ఒకటి కాదు.
రెండు కాదు.రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 600 మొబైల్ టవర్లు మాయం కావడం ఇపుడు అక్కడ పెద్ద చర్చకు దారితీస్తోంది.
వివరాల్లోకి వెళితే, GTL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్ టవర్లను ఏర్పాటు చేస్తుందనే విషయం తెలిసినదే.ఈ క్రమంలో ఇప్పటి వరకు 26,000 టవర్లను ఏర్పాటు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
అయితే వాటి నిర్వహణ భారంగా మారడమేకాకుండా కరోనా విజృంభించడం, లాక్‌డౌన్లు ప్రకటించడంతో ఆయా సేవలను నిలిపివేసింది.దీంతో ఈ టవర్లను అధికారులు ఆదమరిచారు.ఈ విషయం పసిగట్టిన గజదొంగలు అదిరిపోయే ప్లాన్ వేశారు.వారే అధికారులుగా మారి టవర్లను దొంగలించడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలో 2020 నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 టవర్లను దొంగిలిచ్చినట్టు భోగట్టా.
ఇకపోతే అలాంటి ఓ టవర్‌ను ఏర్పాటు చేయడానికి దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది.ఈ లెక్కన ఆ దొంగలు కోట్లాది రూపాయల సొమ్మును దొంగిలిచ్చినట్టు అధికారులు లెక్కలు వేస్తున్నారు.కరోనా తీవ్రత ప్రస్తుతం తగ్గడంతో.పనిచేయకుండా ఉన్న సెల్‌ఫోన్ టవర్లను ఓ సారి చూసొద్దామని అధికారులు బయలుదేరగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాలన్నింటినీ పరిశీలించారు.
ఈ నేపథ్యంలో 600 సెల్‌ఫోన్ టవర్లను దొంగలు ఎత్తుకెళ్లారని అంచనాకు వచ్చారు.ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.