సూర్యాపేట జిల్లా:అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోని పాత పద్ధతిలోనే ఆర్మీలో రిక్రూట్మెంట్ జరపాలని, సికింద్రాబాద్ పోలీస్ కాల్పుల్లో మరణించిన యువకుడి కుటుంబానికి కోటి రూపాయలు,గాయపడ్డ వారికి రూ.50 లక్షలు పరిహారం చెల్లించి,వారి ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం,ప్రగతిశీల యువజన సంఘం,పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి,నిరసన తెలియజేశారు.అనంతరం పి.ఓ.డబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్, పి.వై.ఎల్ జిల్లా నాయకులు గోవుల వీరబాబు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పుడు అగ్నిపథ్ పేరుతోటి మరోసారి యువతను మోసం చేస్తూ నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత నచ్చితే ఉంచుదాం లేకపోతే లేదు అంటూ మోసపూరిత ప్రకటన చేస్తే యువత ఆవేశానికి లోనై తిరుగుబాటు చేస్తే లాఠీచార్జీలు టియర్ గ్యాస్ లు,కాల్పులతో యువత మరణాలకు గాయాలకు కారణమైనారని ధ్వజమెత్తారు.
యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న మోడీ వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు.కార్మికుల పొట్టగొడుతూ కార్మిక చట్టాలు నిర్వీర్యం చేసి ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మి దేశ సంపదను అంబానీ,ఆదానీలకు దోచి పెడుతన్నారని మండిపడ్డారు.
చీకట్లో రైతు నల్ల చట్టాలు తెచ్చి సంవత్సరం పోరాడి,ఏడు వందల మంది రైతులు చనిపోయిన తర్వాత నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నాడని,మళ్లీ ఇప్పుడు అగ్నిపథ్ పేరుతోటి యువతను మోసం చేస్తున్నాడని ఆరోపించారు.ఇకనైనా యువత,ప్రజలు మేల్కొని మోడీ దిగేదాకా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి.ఓ.డబ్ల్యూ నాయకులు పద్మ,రేణుక పి.వై.ఎల్.నాయకులు కొత్తపల్లి వేణు,నరేందర్,పి.డి.ఎస్.యు నాయకులు మహేష్,వీరేష్,వెంకటమ్మ,లక్ష్మి,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.