సూర్యాపేట జిల్లా:మోతె మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.శుక్రవారం అర్ధరాత్రి గ్రామానికి జనార్దన్ రెడ్డి(60)ఆరుబయట మంచంలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవలితో అత్యంత పాశవికంగా హత్య చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన పగడాల జనార్దన్ రెడ్డి (70) శుక్రవారం రాత్రి ఆరుబయట మంచం మీద నిద్రిస్తున్నారు.పక్కనే ఆయన మనవడు సూరకంటి ఉదయ్ రెడ్డి మరో మంచంపై పడుకున్నారు.
ఈ క్రమంలో అర్ధరాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి జనార్దన్ రెడ్డిపై కత్తులతో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.అప్రమత్తమైన ఆయన మనవడు దాడిని అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతని చేతులకు గాయాలయ్యాయి.
నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.
మోతె ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు.నిందితులు ఎటువైపు పారిపోయారనే విషయాన్ని గ్రామస్థుల నుంచి ఆరా తీశారు.
సరిహద్దు జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు.భూవివాదం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు.