తెలంగాణాలో దాదాపు చతికలబడింది అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు జోరందుకుంటున్న సమయంలో వలసలను నివారించి పార్టీని బలోపేతం చేసేందుకు చూస్తోంది.
ఈ మేరకు నాగార్జునసాగర్‌లో టీ.పీసీసీ కార్యవర్గ సమావేశంలో నాయకులంతా ఐక్యంగా చర్చించుకుని నిర్ణయాలు తీసుకున్నారు.అవినీతి విషయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై నిపుణులతో కమిటీ వేయాలని, కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై పోరాటాలు చేయాలని నేతలంతా నిర్ణయించుకున్నారు.అసలు తెలంగాణాలో కొత్త అసెంబ్లీ అవసరం లేదని పాత సచివాలయం కూల్చకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ తీర్మానించింది.
అలాగే కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల వేధింపులు చేయకుండా అడ్డుకునేందుకు అవసరమైతే రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జైల్ భరో, ఇతర కార్యక్రమాలు చేపడదామని పిలుపునిచ్చారు.త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి తమ పార్టీ తడాఖా చూపించాలని నేతలంతా డిసైడ్ అయ్యారు.జులై 1,2,3, 4 తేదీల్లో కొత్త జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
జులై 6, 7, 8 తేదీల్లో మున్సిపల్ స్థాయిలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు.కొత్త, పాత మున్సిపాల్టీలకు కొత్త కమిటీల ఏర్పాటు చేస్తారు.పార్టీ పదవుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు నేతలు.
రాహుల్ గాంధీ అధ్యక్షుడుగా కొనసాగాలని తీర్మానం చేసి పంపించేందుకు సిద్ధం అయ్యారు.సోమవారం జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు సచివాలయాన్ని పరిశీలించి పోరాట కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
ఈ సమావేశంలో నాయకులు తమ ఆలోచనలు చెప్పారు.మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో స్కామ్ జరిగిందని జీవన్‌రెడ్డి ప్రకటించారు.కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమన్నారు.తెలంగాణ భవిష్యత్‌ను నాశనం చేయడానికే మహారాష్ట్రతో ఒప్పందమని.ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి పాదయాత్ర చేయాలన్నారు.తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.రూ.38 వేల కోట్ల ఖర్చుతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చన్న అభిప్రాయం కాంగ్రెస్ వ్యక్తం చేసింది.రూ.5 వేల కోట్లతో పూర్తయ్యే మిషన్ భగీరథకు రూ.50వేల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.కొత్త జిల్లాల వారీగా దత్తత తీసుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులంతా డిసైడ్ అయ్యారు.
ఇప్పటివరకు నాయకుల మధ్య ఉన్న విబేధాలను పక్కనపెట్టి ఇకపై కలిసిమెలిసి ముందుకు వెళ్లి పార్టీని కాపాడుకోవాలని నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు.