తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ జిల్లాలో బస్సుల కార్ఖానా షురూ అయింది.ఇక్కడ బస్సులు తయారుచేస్తారన్న మాట.
దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించారు.దక్కన్ ఆటో లిమిటెడ్ అనే కంపెనీ మూడొందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసింది.
తొలి దశలో ఇక్కడ ఏడాదికి మూడు వేల బస్సులు తయారుచేస్తారు.కాలక్రమంలో ఈ సంఖ్య పెరుగుతుందన్నమాట.ఈ ప్లాంటు హైదరాబాదుకు చాలా దగ్గర.కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది.
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత ఇది మొట్టమొదటి బస్సుల తయారీ పరిశ్రమ.ఈ కార్ఖానాలో తయారయ్యే బస్సులను దేశంలో ఉపయోగించడమే కాకుండా విదేశాలకూ ఎగుమతి చేస్తారట.
ప్రస్తుతం ఈ కంపెనీకి సిమెంటు, ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి.అంటే బడా పారిశ్రామికవేత్తలే కదా.తెలంగాణ ఆర్‌టీసీకి కావల్సిన బస్సులు ఈ కంపెనీ నుంచి కొంటామని కేసీఆర్ చెప్పారు.ఈ కంపెనీ ఐదువేల మందికి ఉద్యోగాలు ఇస్తుందన్నారు.
కేసీఆర్ తన ప్రభుత్వ పారిశ్రామిక విధానం గురించి గొప్పగా చెప్పుకున్నారు.రాష్ర్టానికి భారీ పెట్టుబడులు వస్తాయన్నారు.
పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు.పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన పదకొండు రోజుల్లోనే పదిహేడు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామన్నారు.
రాష్ర్టానికి ఎక్కువ పరిశ్రమలు వస్తే మంచిదే కదా.ఈ దిశగా కేసీఆర్ ప్రయత్నాలు ఫలించాలి.







