దుబ్బాక ఫలితమే కావొచ్చు.లేకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన షాకో కావొచ్చు.
ఏదేమైనా గానీ గులాబీ బాస్ ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ప్రభుత్వాన్ని పార్టీని గాడిలో పెట్టేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత బీజేపీ తెలంగాణలో మరింత బలపడేందుకు చాపకింద నీరులా వ్యాపిస్తూ ముందుకు దూసుకుపోతోంది.ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని తాజా, మాజీ నేతలను తమ పార్టీలోకి లాగేసుకునేపనిలో నిమగ్నమైంది.
ఈ రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు కొందరు రహస్యంగా బీజేపీ నేతలతో ఇప్పటికే టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

నేతలు ఎవ్వరూ చేజారిపోకుండా ఉండేందుకు గులాబీ బాస్ సరికొత్త వ్యూహంను అమలు చేస్తున్నారు.దీనికోసం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను తెరమీదకు తీసుకొస్తున్నారని తెలిసింది.ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా పార్టీ శ్రేణులెవ్వరూ వెరే పార్టీ వైపు తొంగి చూడకుండా కట్టడి చేసేందుకు రెడీ అవుతున్నారట.
రాష్ట్రంలో 75 దాకా కమిషన్లు, కార్పొరేషన్లు ఉన్నాయి.వీటిలో కొన్నింటికి ఛైర్మన్లు ఉన్నారు.ఇంకా కొన్నింటికి లేరు.కొన్నిటికి గడువు అయిపోయినా ఇంకా వాటిని భర్తీ చేయకుండా అలానే పెండింగ్‌లో పెట్టారు.
పెండింగ్‌లో ఉన్నవాటిలో 25 వరకు నామినేటెడ్ పోస్టులను మొదట భర్తీ చేసేందుకు గులాబీ బాస్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.తద్వారా తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్టీ నేతలు, శ్రేణులు దూరం కాకుండా ఉండేందుకు కేసీఆర్ ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొబోతున్నట్లు తెలుస్తోంది.
అర్హులైన వారిని కమిషన్లు, కార్పొరేషన్లలో నియమించేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ సహా నలుగురు సభ్యుల పదవీకాలం గురువారంతో ముగియనుంది.
అలాగే ఇంకా చాలా వరకు కార్పొరేషన్లు, కమిషన్లలో ఖాళీలున్నాయి.వీటిని వారం పది రోజుల్లో భర్తీ చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు, పార్టీని అంటిపెట్టుకుని ఉండేలా గులాబీ బాస్ అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలిసింది.