ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపి అధినేత చంద్రబాబు రాజకీయంగా స్పీడ్ పెంచుతున్నారు.స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు కావడం, బెయిల్ పై బయటకు రావడం తదితర పరిణామాల దగ్గర నుంచి జనాలకు బాబు దూరంగానే ఉంటున్నారు.
కానీ పార్టీకి సంబంధించి రాజకీయ వ్యూహాల్లో నిమగ్నం అయ్యారు.చాలా రోజులుగా ఏపీ పర్యటించేందుకు చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.
తాజాగా చంద్రబాబు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది.జనవరి 5 నుంచి 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
అలాగే రెండు రోజుల్లో మూడు బహిరంగ సభలు నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
మొదటి విడతలో జనవరి 5 నుంచి 10వ తేదీ వరకు బహిరంగ సభల షెడ్యూల్ ఉండబోతుంది .అలాగే తొలి విడతలో ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లను కవర్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.మొదటగా ఒంగోలు పార్లమెంటు నుంచి బహిరంగ సభలను చంద్రబాబు ప్రారంభించనున్నారు.
జనవరి 5న కనిగిరిలో బహిరంగ సభ , జనవరి 7 న తిరువూరు, ఆచంటలో బహిరంగ సభలు, జనవరి 9న వెంకటగిరి , ఆళ్లగడ్డలో జరిగే బహిరంగ సభలో , జనవరి 10న పెద్దాపురం , టెక్కిలిలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు.జనవరి 29 నాటికి 25 సభలను పూర్తి చేసే విధంగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.
తొలి విడత బహిరంగ సభలు ముగియగానే.రెండో విడత బహిరంగ సభల షెడ్యూల్ ను విడుదల చేసేందుకు టిడిపి సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే చంద్రబాబు పాల్గొనే బహిరంగ సభలో ఏపీ అధికార పార్టీ వైసిపిని టార్గెట్ చేసుకునే విమర్శలు చేయనున్నారు.అలాగే జనసేన పార్టీతో పొత్తు ఆవశ్యకతను గురించి పార్టీ శ్రేణులు, ప్రజలకు చంద్రబాబు వివరించనున్నారు.ఈ బహిరంగ సభ ద్వారా ప్రజల చూపు తమ పార్టీ వైపు ఉండే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.