టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ రాజకీయ జీవితం మొదట్లో ఒడిదుడుకుల్లో ఉన్నట్టు గా కనిపించినా, ఇప్పుడిప్పుడే ఆయన సత్తా ఏమిటో అందరికీ అర్థమవుతోంది.ముఖ్యంగా సొంత పార్టీ నాయకుల్లోనే లోకేష్ ఎవరికీ నమ్మకాలు ఉండేవి కాదు.
దీనికి తగ్గట్టుగానే లోకేష్ వ్యవహారాలు ఉండేవి.పార్టీలో కేవలం కొంతమంది నాయకులు చెప్పినట్లుగా నడుచుకుంటూ, మిగతా వారిపై పెత్తనం చేస్తూ, వారికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ వేలు పెడుతూ, ఆ పార్టీ నాయకుల ఆగ్రహాన్ని లోకేష్ చవిచూశారు.
సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా అందరిపైనా పెత్తనం చేస్తూ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం చేశారు.టిడిపి అధికారంలో ఉండటం, చంద్రబాబు రాజకీయ వారసుడుగా లోకేష్ కు గుర్తింపు ఉండడంతో ఆయన వ్యవహారాలపై పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నా, పైకి చిరునవ్వు చిందిస్తూ ఉండేవారు.
టీడీపీ నుంచి ఎవరు బయటకు వెళ్ళినా లోకేష్ పైన విమర్శలు చేసేవారు.అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.లోకేష్ పనితీరు గతంతో పోలిస్తే బాగా మెరుగు పడడం, ఆయన నాయకత్వ లక్షణాలు మెరుగుపడటం, ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా, పార్టీ నాయకుల్లో ఉత్సాహం తీసుకువచ్చే విధంగా వ్యవహరించడం వంటి విషయాలు లోకేష్ పై నమ్మకాన్ని పెంచుతున్నాయి.

ఇటీవల టెన్త్ ఇంటర్ పరీక్షలు రద్దు విషయంలో లోకేష్ పోరాడడం, దానికి తగ్గట్టుగానే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావడం తదితర అంశాలు అన్ని లోకేష్ కు క్రెడిట్ తీసుకువచ్చాయి.
ఇక ఏపీలో ప్రధాన సమస్యగా నిరుద్యోగుల అంశాన్ని లోకేష్ హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.దీని ద్వారా యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, వైసీపీకి యూత్ మద్దతు లేకుండా చేయాలని, క్రమంగా తన నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలనే దిశగా లోకేష్ ముందుకు వెళుతున్న తీరు సొంత పార్టీ నేతల్లో లోకేష్ పై నమ్మకాన్ని మరింతగా పెంచుతున్నాయి.