ఏపీలో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి, రెండు పార్టీలకు కూడా ఈసారి ఎన్నికలు కీలకం అయిన నేపథ్యంలో స్ట్రాటజీల విషయంలో కూడా అధినేతలు ఎక్కడ తగ్గడం లేదు.అధికార వైసీపీ ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజలకు చూపిస్తూ.
ప్రజల దృష్టిని ఆకర్షించే పనిలో ఉంది.మరోవైపు టీడీపీ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు ఎత్తిచూపిస్తూ వైసీపీని గద్దె దించే పనిలో ఉంది.
ఇలా ఇరు పార్టీలు కూడా స్పష్టమైన ఎజెండాతో ముందుకు కదులుతున్నాయి.

అయితే రాజకీయ పరంగా బద్ద శత్రువులుగా భావించే వైఎస్ జగన్ మరియు చంద్రబాబు ప్రస్తుతం ఒకే వ్యూహాన్ని అమలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.వైఎస్ జగన్ గృహ సారథులు అనే కన్సెప్ట్ ను తెరపైకి తెచ్చి ప్రతి 50 ఇళ్లకు ఒక సారధి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ యొక్క సారథుల ద్వారా ప్రజాభిప్రాయాలను సేకరించడంతో పాటు, పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే విధంగా జగన్ ప్రణాళిక రచించారు.
జగన్ ప్రవేశ పెడుతున్న పథకాల ఉపయోగాలు, జగన్ పరిపాలనలో జరిగిన మేలును ప్రజలకు వివరించడం ఈ యొక్క గృహ సారథుల ప్రధాన విధి.అంతే కాకుండా వీరిని ఎన్నికల పనుల్లో కూడా జగన్ వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇదే కన్సెప్ట్ ను ప్రస్తుతం చంద్రబాబు కూడా అమలుచేయబోతున్నారు.గృహ సారథులకు పోటీగా ” సాధికార సారథులను చంద్రబాబు రంగంలోకి దించనున్నారు.వీరి యొక్క ప్రధానమైన విధి టీడీపీ పై ప్రజల్లో నమ్మకం కల్పించడం అలాగే చంద్రబాబు ఇస్తున్న హామీలను ప్రజలకు వివరించడం.ప్రతి 30 ఇళ్లకు ఒక కుటుంబ సాధికార సారథి ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు చంద్రబాబు.
ఇలా ఇరు పార్టీల అధినేతలు ప్రజాభిప్రాయాలను సేకరించేందుకు ఒకే పంథాలో వెళ్ళడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.మరి వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజానీకం తిరిగి వైసీపీకే పట్టం కడుతుందా ? లేదా టీడీపీ వైపు మొగ్గు చూపుతుందా ? లేదా జనసేనకు అవకాశం ఇస్తుందా ? అనేది చూడాలి.మొత్తానికి ఏపీలో ప్రస్తుతం సారథుల గోల హాట్ టాపిక్ గా మారింది.