ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రతి ఊరి నుంచి, దేశంలోని పుణ్యక్షేత్రాల నుంచి, నదుల నుంచి మట్టి.నీరు సేకరించి తీసుకు రావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెంటిమెంటు పైకి చాదస్తంగా కనబడుతున్నా ఇది ఒక మంచి పనేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఊళ్ళ నుంచి, దేశంలోని పలు ప్రాంతాల నుంచి నీరు, మట్టి తీసుకురావాలని చెప్పిన చంద్రబాబు ఇందులో తెలంగాణను కూడా భాగస్వామిని చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ద్వేష భావం, మనస్పర్థలు, అంతరాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.తెలంగాణాలోని యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర మొదలైన హిందూ పుణ్య క్షేత్రాల నుంచే కాకుండా మెదక్ చర్చి, మక్కా మసీదు నుంచి కూడా నీరు, మట్టి సేకరించాలని ఆదేశించారు.
ముఖ్యంగా తెలుగు ప్రధాని పీవీ నరసింహా రావు సొంత ఊరైన కరీంనగర్ జిల్లా వంగర నుంచి కూడా నీరు, మట్టి తీసుకురావాలని చెప్పడం విశేషం.పీవీ నరసింహారావు కేవలం తెలంగాణా నాయకుడు కాదని, ఆయన ఆంద్ర ప్రజలకు కూడా ఆత్మీయుడని తెలియ చెప్పడం మట్టి, నీరు సేకరణలో దాగి ఉందని అంటున్నారు.
సెంటిమెంటును ప్రజల ఐక్యతకు ఉపయోగించడం మంచి పనే.చంద్రబాబు తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ని ఆహ్వానించిన తీరు రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం నెలకొల్పే విధంగా ఉంది.చంద్రబాబును కెసీఆర్ రిసీవ్ చేసుకున్న తీరు అభినందనీయం.ఆరు నెలల తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు మనసు విప్పి మాట్లాడుకున్నారు.అమరావతి మంచిగా అభివృద్ధి కావాలని కెసీఆర్ కోరుకున్నారు.వాస్తు బాగుందని చెప్పారు.
పాలన పూర్తిగా విజయవాడ నుంచి కొనసాగించాలని బాబు నిర్ణయించుకోవడంతో అన్ని కార్యాలయాలు విజయవాడకు తరలిపోతున్నాయి.కాబట్టి తెలంగాణా పాలకులతో బాబుకు తలనొప్పి తగ్గే అవకాశం ఉంది.