వ్యవసాయంలో( Agriculture ) అధిక నాణ్యమైన దిగుబడి సాధించాలంటే మేలు రకం విత్తనాలు, ఎరువులు, మద్దతు ధరతో పాటు నేల స్వరూపం ప్రధానమైనవి.అయితే కొంతమంది రైతులు సరైన అవగాహన లేక ఎక్కువగా రసాయన ఎరువులు, రసాయన పిచికారి మందులపై ఆధారపడడంతో నేల తన స్వరూపాన్ని కోల్పోతుంది.
ప్రస్తుతానికి రసాయన ఎరువుల వల్ల అధిక దిగుబడి రావొచ్చు కానీ భవిష్యత్తులో ఆ నేల వ్యవసాయానికి ఉపయోగపడకుండా పోయే అవకాశం ఉంది.

ముందుగా పొలంలో అక్కడక్కడ మట్టిని సేకరించి సాయిల్ టెస్ట్ కు( Soil Test ) పంపించాలి.ఆ టెస్టులో పొలంలో ఏ ఖనిజా లవణాలు ఎంత మోతాదులో ఉన్నాయో బయటపడుతుంది.అప్పుడు కావాల్సిన ఎరువులను తగిన మోతాదులో పొలంలో వేసుకోవచ్చు.
చాలామంది రైతులు రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు వాడాలి అని వినే ఉంటారు.సేంద్రియ ఎరువులు అంటే కేవలం పశువుల ఎరువు మాత్రమే కాదు.
పచ్చి రొట్ట పైర్లు, వేప పిండి లాంటివి చాలా ఉన్నాయి.ఇప్పుడు మనం పొలంలో వేప పిండి వేసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

వేప పిండి( Neem Powder ) అనేది నేలలో సేంద్రీయ కర్బన శాతాన్ని పెంచుతుంది.నేల స్వరూపంలో మార్పు చోటు చేసుకుంటుంది.ముఖ్యంగా నేలలో చౌడు శాతాన్ని తగ్గిస్తుంది.అంతే కాదు నేల తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.వేప పిండి వేసుకుంటే నేలలో వాన పాముల వ్యాప్తి కూడా మెరుగవుతుంది.నేలలో చీడపీడల అవశేషాలను, హానికర సూక్ష్మజీవులను అరికడుతుంది.
సంవత్సరం మొదటలో కేవలం ఒక్కసారి ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నితే సరిపోతుంది.ఇక ఒక సంవత్సరం పాటు మొక్కలలో వచ్చే కుళ్ళు తెగుళ్లను, నులిపురుగులను అదుపు చేస్తుంది.
క్రమంగా అధిక దిగుబడి పొందవచ్చు.కల్తీ లేని వేప పిండి మాత్రమే పొలంలో పోవాలి.